Top Bar Ad

Breaking News

*** 24x7onlinenews.com(30-May): Union Ministry of Home Affairs (MHA) issued New Guidelines to fight COVID-19 to be effective from 1st June 2020 ***

Yadadri Sri Laxmi Narasimha Swamy Vari Brahmotsavalu – 04-March-17, DAY-6

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము, యాదగిరి గుట్ట – శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు -2017, 04-March-17, DAY-6

శ్లో: శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే, భోగేంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే

యోగీశ శాశ్వత చరణ్య భవాబ్ది పోత, లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమ్

శ్లో:మాతా నృసింహశ్చ, పితా నృసింహః భ్రాతా నృసింహశ్చ, సఖా నృసింహః

విద్యా నృసింహోః,  ద్రవిణం నృసింహః, స్వామీ నృసింహః, సకలం నృసింహః

  ******************

స్వస్తి శ్రీ దుర్ముఖి నామ సంవత్సర, ఫాల్గుణ శుద్ధ పాడ్యమి సోమవారము తేదీ 27-02-2017 నుండి 09-03-2017 గురువారము ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకు బ్రహ్మోత్సవములు అత్యంత వైభవముగా జరుగుచున్నవి. అందులో భాగంగా ఉదయము 5 గంటలకు స్థానిక శ్రీ వైష్ణవ సేవా సమాఖ్య వారిచే తిరువీధులలో “ప్రభాతభేరి” శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాదులతో వైభవంగా నిర్వహింపబడినది. శ్రీ స్వామి వారి ఆలయములో ఉదయం వేద పారాయణములు, నిత్య హవనములు, పంచసూక్త పఠనములు, మూలమంత్ర జపములు, చతుర్వేద పారాయణములు, పారాయణీకులచే నిర్వహింపబడినవి.

యజ్ఞాచార్యులు శ్రీమాన్ ఎస్. శ్రీనివాసాచార్యులు గారు బ్రహ్మోత్సవ నిత్య కార్యక్రమములు నిర్వహించిరి. అనంతరము భక్తుల సందర్శనార్థము బాలాలయములో శ్రీ స్వామి వారిని గోవర్ధన గిరిధారి అలంకార సేవలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యము కలిగించిరి. ఈ వేడుకలో ఆలయ ధర్మకర్త శ్రీ బి. నరసింహమూర్తి గారు, శ్రీమతి ఎన్.గీత, కార్యనిర్వహణాధికారిణి గారు, ఆలయ పేష్కారు, పర్యవేక్షకులు, ప్రధాన అర్చకులు, అర్చక బృందము, ఆలయ ఇన్స్ పెక్టర్లు, మరియు ఉద్యోగ సిబ్బంది పాల్గొని శ్రీ స్వామి వారిని సేవించి తరించిరి.

గోవర్ధన గిరిధారి అలంకార సేవ విశిష్టత: శ్రీకృష్ణ భగవానుడి లీలలన్నీ అతిమానుష చేష్టతములే, వాటిలో గోవర్ధన గిరిధారి గా విశిష్టతను దర్శింపజేసిన తీరు అపూర్వము, అత్యద్భుతము. గోవర్ధనమనగా గోవులను ఉద్ధరించుట అని అర్థము. ఈ లీలలో గోవర్ధన పర్వతమును చిటికెన వ్రేలిపై ఎత్తిన భగవానుని స్వరూపమును దర్శించుట. ఈ లీలలో భగవానుడు కేవలం పర్వతము ఎత్తినట్లు కనిపించిన, ఇంద్రుని గర్వభంగము అష్ట దిక్పాలకుల అహంకార విమోచనము. బ్రహ్మాదిదేవతలకు జ్ఞానమును, నందవ్రజములోని గోగోప, గోపిజన పరిరక్షణము పాషాణాదులకు(రాళ్ళకు) సైతమూ మోక్షప్రదత్వము, గోవర్ధన పర్వతముపై గల సమస్త ప్రాణికోటికీ ముక్తిప్రదత్వము, ప్రకృతి సంపదకు పరిపుష్టిని కలిగించి రక్షించిన తీరు అద్భుతము. శ్రీరామావతారములో “ద్రోణి” అను పర్వతము భగవానుడికి సముద్రమును దాటుటకు తనను ఒడ్డుగా ఉండుటకు అంగీకరించమని ప్రార్థించగా, ఆ ప్రార్థనను రానున్న శ్రీకృష్ణావతారములో గోవర్ధనగిరి పర్వత స్వరూపములో తానే స్వయముగా చిటికెన వ్రేలిపై ధరించి అనుగ్రహించెదనని దర్శింపజేసిన లీల ఈ గోవర్ధన గిరిధారి లీల. గోవులు అనగా లోకములు అని, వేదములు అని, జీవులని, సమస్త నదీనదములని, వాటిని తానే ఉద్ధరించి రక్షించేవాడినని తెలియజేసే లీల ఈ గోవర్ధన గిరిధారి లీలగా వ్యాస భగవానుడు పేర్కొనిరి. ఈ ఈ గోవర్ధన గిరిధారిగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు సమస్త లోకరక్షకుడిగా భక్తకోటిని అనుగ్రహించుట ఎంతో విశేషమై యున్నది.

సాయంత్రము:- శ్రీవారి బాలాలయములో, నిత్య కైంకర్యములు, హవనములు, మూల మంత్ర జపములు నిర్వహించెదరు. అనంతరము శ్రీ స్వామివారిని సింహవాహన సేవలో అలంకరించి భక్తులకు దర్శనము గావించెదరు.

సింహవాహనము ప్రత్యేకత:- ‘మృగాణాంచ మృగేంద్రోహమ్’ అంటూ భగవానుడే తన స్వరూప స్వభావములను సింహరూపములుగా పేర్కొనుటచే, “సింహం” సాక్షాత్ భగవత్ స్వరోఓపమే అని తెలియబడుచున్నది. శ్రీ మహావిష్ణువు అవతరించిన శ్రీ నరసింహావతారములో అత్యంత శ్రేష్టమైన సింహాకృతిని శిరస్సుగా, నరును ఆకృతిని దేహముగా స్వీకరించుట, ఈ రెండిటిలో శిరస్థానం శ్రేష్ట భాగము “సింహం”  అని సింహము యొక్క ఔన్నత్యము తెలియబడుచున్నది. బ్రహ్మోత్సవములలో ఈ సింహవాహన సేవ అలంకరణలో సాక్షాత్  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని అలంకరించుటలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకొనినది.

సింహము కోపచటులతకు, శౌర్య స్ఫోరకమునకు, గాంభీర్య ప్రదర్శనకు, ఇంద్రియ నిగ్రహమునకు మరి ఎన్నింటికో ప్రతీకగా నిలిచినది. అడవిలో సింహము ఉంటేనే అడవిలోని మిగతా జంతువులకు అన్నింటికీ రక్షకము కనుక, జగద్రక్షకుడైన స్వామి కేవలము క్రౌర్య, శౌర్య పరాక్రమములనే ప్రతీకగా కాక, సర్వ రక్షకుడిగా ఈ అలంకార సేవలో భక్తులను రక్షించి అనుగ్రహించుట విశేషమై యున్నది.

సింహము హింసకు ప్రతీకయే అయినా, నరసింహుడిలోని సింహము దుష్టశిక్షణకు శిష్ట రక్షణకు ఏర్పడినది అని పెద్దల భావన. కనుకనే బ్రహ్మోత్సవములలో ఈ విశిష్టమైన అలంకార సేవ భక్తజన రక్షణలో స్వామికి గల ఔదార్య గుణమును ప్రకటించుటకై అలంకరించెదరు. శ్రీ స్వయంభూ పంచ నారసింహ క్షేత్రములలో సింహవాహనారూఢుడైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారల దర్శనము సర్వవిధ పాప కర్షణం, “స్వామిన్ నృసింహః సకలం నృసింహః”.

ఉచిత వైద్య శిబిరము:– తేదీ 04-03-2017 శనివారము రోజున దేవస్థానమువారు భక్తులకు ఉచితంగా వైద్యసేవలు అందించుటకు గాను, చెవి, ముక్కు, గొంతు (ఇ.ఎన్.టి) వైద్యశిబిరము డా. ఎ. రాంబాబు, ఎం.ఎస్ (ఇ.ఎన్.టి), డా. జి. శ్రీనివాస్, ఆడియోలజిస్ట్, అపోలో హాస్పిటల్, హైదరాబాదు వారిచే కొండపైన శ్రీ చక్ర కాంప్లెక్స్ బ్లాక్ నం.3 నందు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిరి. భక్తులకు (4) గురి భక్తులకు వినికిడి యంత్రమును, మరియు ఒకరికి అవసరము మేరకు శస్త్రచికిత్స ఉచితముగా అపోలో హాస్పిటల్ లో చేయుటకు అంగీకరించిరి. 100 మందికంటే అధిక భక్తులు పాల్గొని వైద్య పరీక్షలు గావించుకొనిరి.

ధార్మిక సాహిత్య సంగీత మహా సభలు:- (తేదీ 04-03-2017 శనివారము)

(సాంస్కృతిక కార్యక్రమములు తేదీ 04-03-2017 నుండి 08-03-2017 వరకు)

శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవములలో భాగంగా శ్రీ స్వామివారికి ప్రీతికరమైన ధార్మిక, సంగీత, సాహిత్య, నృత్య, ఉపన్యాసములు, భజనలు, హరికథలు, నాటకములు, చిందు యక్షగానములు ఎన్నో ఈ క్షేత్రములో నిర్వహించుట ప్రఖ్యాతినొంది యున్నది. “గాన లోలుడు” శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారు గనుక స్వామివారిని గానామృతముతో అర్చించిన సర్వవిధ శుభములు, ఆరోగ్యాదులు ఎందరో భక్తులకు చేకూరినట్లు స్థానిక భక్తుల ప్రగాఢ విశ్వాసము. దానికి ఉదాహరణగా తన కీర్తనలతో స్వామిని మెప్పించి, స్వామి అనుగ్రహముతో ఆరోగ్యమును పొందిన శ్రీ బ్రహ్మశ్రీ బాపట్ల లక్ష్మీకాంతయ్య గారు ఆద్యుడిగా ఈ క్షేత్రములో ఈ సభలు నిర్వహించు సందర్భములో ప్రశంసలను పొందుట ఈ సభలకు గల ప్రాముఖ్యతను సూచించుచున్నది. సుమారు 200 సంవత్సరాల పూర్వమే భక్తకోటి ఈ క్షేత్రములో భగవన్నామ సంకీర్తన భజనలు నిర్వహించినట్లు ఎన్నో దృష్టాంతములు కలవు.

వాటిలో భాగంగా ఈ రోజు స్థానిక శ్రీ గాయత్రీ భజన మండలి వారిచే, శ్రీ విశ్వాంజనేయ భజన మండలి, కార్వాన్, హైదరాబాద్ వారిచే భజన కార్యక్రమములు నిర్వహింపబడినవి. అనంతరము దేవాలయ అధికారులచే భక్తుల మధ్య సభా ప్రారంభము గావింపబడినది. ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుచున్నందున, ఈ సభలు శ్రీ స్వామి వారికి ప్రీతికరములైనందువలన, ఉత్సవములతోపాటు ఉన్నంతలో నిర్వహించబడుచున్నవి అని కార్యనిర్వహణాధికారిణి తెలియజేసిరి.

భక్తులలో భక్తి భావన పెంపొందింపజేయుటయే ఈ హరికథలు, భజనలు, నృత్యములు అని అనువంశిక ధర్మకర్త గారు తెలియజేసిరి. అనంతరము మంగళ వాయిద్యము నిలయ విద్వాంసులచే మరియు వైదిక ప్రార్థన ఆస్థాన వేద పండితులచే నిర్వహించబడినది. అనంతరము శ్రీ కందాళ శ్రీనివాసాచార్యులు గారిచే ఆధ్యాత్మిక ఉపన్యాసము గావింపబడినది. భగవానుడు-భక్తి తత్వము అను అంశముపై శ్రీ భగవద్రామానుజుల వైభవమును పేర్కొనిరి.

అనంతరము శ్రీమతి కె. శారద భగవతారిణిచే భక్త ప్రహ్లాద అను హరికథా కాలక్షేపము గావింపబడినది. వీరికి నిలయ విద్వాంసులు వాయిద్య సహకారము అందించిరి. వీరి హరికథాగానము విని భక్తులు ఆనందించిరి.

IMG-20170304-WA0028 IMG-20170306-WA0011
<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *