Top Bar Ad

Breaking News

24x7onlinenews.com (02.07.19): తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) గద్వాల డిజిథాన్ యాత్రకు విశేష స్పందన –  మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరిన జిల్లా కలెక్టర్; ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నూతన అంశాలు, అవకాశాలపై అవగాహన కల్పించే క్రమంలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం – టీటా గ్లోబల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల

తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) గద్వాల డిజిథాన్ యాత్రకు విశేష స్పందన –  మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరిన జిల్లా కలెక్టర్;  

ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నూతన అంశాలు, అవకాశాలపై అవగాహన కల్పించే క్రమంలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం – టీటా గ్లోబల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల

నిర్వాహక బృందాల మధ్య సుహృద్భావ వాతావరణంతో పోటీలు

హైదరాబాద్, జూలై 2 , 2019: తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) చేపట్టిన గద్వాల డిజిటల్ డిజిథాన్ యాత్రకు విద్యార్థులు, ప్రభుత్వ వర్గాల నుంచి విశేష స్పందన వచ్చింది. రెండు రోజుల పాటు ఉత్సాహభరితంగా సాగిన శిక్షణా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రశంసించిన జిల్లా కలెక్టర్ శశాంక, ఐఏఎస్.  మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. గద్వాల జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు టీటా నేతలు భాగస్వామ్యం పంచుకున్న బృందాల మధ్య అంతర్గత పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ యాత్రకు వెళ్లే టెకీలకు సంబంధించి రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఐఏఎస్ హైదరాబాద్ లో జెండా ఊపి ప్రారంభించగా, డిజిథాన్ డిజిటల్ యాత్రను గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు.

సాంకేతిక విద్యను సర్కారీ పాఠశాలల్లోని విద్యార్థులకు నూతన విధానంలో చేరువ చేసేందుకు టీటా ‘డిజిథాన్ డిజిటల్ యాత్ర` చేపట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ నైపుణ్యాలపై శిక్షణ అందించి దానికి కొనసాగింపుగా గద్వాల జిల్లాలోనూ ఈ కార్యక్రమం చేపట్టింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో జూన్ నెల 29 మరియు 30 తేదీల్లో టీటా ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు డిజిటల్ యాత్రలో భాగంగా, 124 పాఠశాలల్లో గల 12,329 మంది 8,9 తరగతుల విద్యార్థులకు సాంకేతిక విద్య అందించారు. హైదరాబాద్ కు చెందిన 150 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు గద్వాలకు విచ్చేసి 2 రోజులు అక్కడే రెసిడెన్షియల్ హాస్టల్లలో నిద్ర చేయడంతో పాటుగా, డిజిటల్ లిటరసీతో పాటుగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులతోనే కలిసి బోజనం, వారితోనే రాత్రి నిద్ర సైతం చేశారు.

ఈ 16 గంటల ట్రైనింగ్ లో భాగంగా కంప్యూటర్ బేసిక్స్, ఇంటర్నెట్ పై ప్రాథమిక అవగాహన, ఈ-మెయిల్ ఖాతా సృష్టించడం, నగదు రహిత లావాదేవీలు, గూగుల్ మ్యాప్స్, సెర్చ్ఇంజిన్స్ పై శిక్షణ ఇచ్చారు. క్యాంప్ ఫైర్, పలు అంశాలపై డిస్కషన్లు, విద్యార్థులకు చెందిన మరికొన్ని కార్యక్రమాలు చేపట్టారు. దీంతోపాటుగా, ఎంటర్ప్రెన్యూర్షిప్ అవగాహన అందించారు. వివిధ దేశాల నుంచి కనెక్ట్లో భాగంగా మెక్సికో మరియు దక్షిణాఫ్రికాకు చెందిన విద్యార్థులతో పాటుగా వివిధ వర్గాలకు చెందిన వారితో అనుసంధానం అయ్యారు.

 

టీటా చేపట్టిన ఈ యాత్రకు వెళ్లే టెకీల బస్సులను జెండా ఊపి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేశ్ రంజన్, ఐఏఎస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ…సర్కారీ పాఠశాలల్లోని విద్యార్థులకు సాంకేతిక విద్యపై అవగాహన కల్పించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వారిని సాంకేతిక విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు జిల్లాల వారీగా ‘డిజిథాన్ డిజిటల్ యాత్ర’ను టీటా చేపట్టడం విప్లవాత్మక మార్పులకు వేదికగా నిలుస్తుందని అన్నారు. జోగుళాంబ గద్వాలలోని పాఠశాలలోని విద్యార్థుల వద్దే ఉండి అక్కడే బస చేసి వివిధ నైపుణ్యాలను నేర్పించేందుకు టీటా టెకీలు చేపట్టిన ఈ డిజిథాన్ డిజిటల్ యాత్రను శుక్రవారం హైదరాబాద్లో శ్రీ జయేశ్ రంజన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ నైపుణ్యాలపై శిక్షణ అందించి దానికి కొనసాగింపుగా గద్వాల జిల్లాలోనూ ఈ కార్యక్రమం చేపట్టడాన్ని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రశంసించారు.

కాగా, ఈ యాత్రలో భాగంగా…12 మండలాలకు 12 బృందాలను ఏర్పాటు చేసిన శిక్షణను పూర్తి స్థాయిలో సమన్వయం చేశారు. ఈ బృందాలకు 12 మంది కెప్టెన్లు, 12 మంది వైస్ కెప్టెన్లు ఏర్పాటు చేశారు. 12 బృందాల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణంలో పోటీ నిర్వహించారు. సోషల్ మీడియా అవార్డులులు సైతం అందించారు. బృందాల మధ్య పోటీలో, గద్వాల మండలం టీం మొదటి స్థానంలో నిలిచింది. లక్ష్మీనారాయణ మరియు పూజ బృందం ఈ ఘనతను సొంతం చేసుకుంది. మల్డకల్ మండలానికి ప్రాథినిధ్యం వహించిన సౌమ్య మరియు శ్రావ్య రెండో స్థానంలో, ఐజా మండలం బృందం కెప్టెన్, వైస్ కెప్టెన్ తరుణ్ మరియు స్వాతి మూడో స్థానంలో నిలిచారు. వీరందరికీ ఈ సందర్భంగా అవార్డులను కలెక్టరు అందించారు.

జిల్లా కలెక్టర్ శశాంక ఈ సందర్భంగా టీటా ప్రయత్నాన్ని అభినందించారు. చిన్నారులు టీటా వాలంటీర్లతో అన్నా, అక్కా అంటూ అనుసంధానం అవడం సంతోషకరమని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉత్తమమైన శిక్షణ అందించిన టీటా బృందం తిరిగి మరోమారు పర్యటించి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా టీటా శిక్షణలో పాలుపంచుకున్న ప్రతినిధి బృందం ప్రజెంటేషన్ ఇచ్చింది.

జిల్లా కలెక్టర్ మరియు డీఈఓ జడ్జీలుగా ఉండి వాటిని అధ్యయనం చేశారు. ఆయా బృందాలు తమ పనితీరును మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించారు. ఇదిలాఉండగా, ప్రభుత్వ పాఠశాల్లోని కంప్యూటర్లు బాగాలేకపోవడం, ఇతరత్రా అంశాల గురించి వివరించి పాఠశాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు టీటా సభ్యులు తమ వంతు కృషి చేశారు.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం సందర్భంగా టీటా గ్లోబల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నూతన అంశాలు,అవకాశాలపై అవగాహన కల్పించే క్రమంలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గద్వాల జిల్లా అధికారుల సహాయ సహకారాలతో టీటా కలిసి డిజిటల్ యాత్ర టీం పనిచేసిందని వెల్లడించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్లలో పాఠశాలలోనే డిజిటల్ వాలంటీర్లు నిద్ర చేశారని, ఈ సందర్భంగా డిజిటల్ లిటరసీ సహా సంబంధించిన వాటితో పాటుగా మరికొన్ని అంశాలపైనా విద్యార్థులకు శిక్షణ ఇచ్చారని తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో టెక్నాలజీ ఇన్నోవేషన్ ఆండ్ ఇంక్యుబేషన్ సెంటర్ (టీఐఐసీ క్లబ్) ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ క్లబ్లో పాఠశాలలోని ఇద్దరు విద్యార్థులు, ఒక టీచర్ బృందం టీటా లీడర్షిప్ టీంతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. ఇందులో టీటా సభ్యులు మెంటారుగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సహాయం చేయాలనుకునే వారు పాఠశాలలకు ఉపయోగపడే వాటిని విరాళంగా అందించాలని కోరారు. ఉపయోగించిన ల్యాప్ట్యాప్లు, కంప్యూటర్లు ఉంటే ఈ పాఠశాలలకు అందించవచ్చని సందీప్ విన్నవించారు. ప్రొజెక్టర్, ఇంటర్నెట్ కనెక్షన్ కల్పించే డాంగుల్స్ సైతం డొనేట్ చేయవచ్చని ఆయన వెల్లడించారు.

ఈ యాత్రలో టీటా ప్రతినిధులు రాణాప్రతాప్ బొజ్జం, అశ్విన్ చంద్ర, శ్రీలత, ప్రదీప్, ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *