తోటి కళాకారులను ఆదుకోవాలనే హృదయం ఉండడం గొప్ప వరం – ప్రభుత్వ సలహాదారు కె.వి రమణాచారి
పేద కళాకారులను ఆదుకోవాలనే హృదయం ఉండడం గొప్ప విషయమని అదొక వరమని ప్రభుత్వ సలహాదారు కె. వి రమణాచారి అన్నారు. ఈ రోజు రవీంద్రభారతిలో పేద కళాకారుల సహాయార్థం యూనిక్ ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో సహారా పేరిట సంగీత విభావరి నిర్వహించారు.
తమ కళా ప్రతిభతో వివిధ కార్యక్రమాలలో నిత్యం ప్రేక్షకులను ఆనందపరిచే కళాకారులు తెరవెనుక అనేక కష్టాల కడలిలో ఎదురీదుతున్నారు. అలంటి కళాకారుల కష్టాలను తెలుసుకొని వారి జీవితాలకు వెలుగునివ్వాలని, వారికి తమ వంతు సాయం చేసి, చేయూతనివ్వలనే ఒక మంచి సంకల్పంతో ముందుకొచ్చారు గాయకుడు మల్లికార్జున్ (చింటూ) . యూనిక్ ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో “సహారా” పేరిట పేద కళాకారుల సహాయార్థం నిర్వహించిన సంగీత విభావరిలో సహచర వికలాంగులైన కళాకారులకు ట్రై సైకిళ్లు, కుట్టు మిషన్లు, ఆరోగ్య కార్డులను ముఖ్య అతిథిగా హాజరైన రమణాచారి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
పేద కళాకారులకు చేయూతనివ్వడంలో గాయకుడు మల్లికార్జున్ మిత్ర బృందం చేస్తున్న కార్యక్రమాలను, వారి కృషిని రమణాచారి ప్రశంసించారు. సమాజం కోసం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంకోసం వారికి సహాయం చేయడం ఒక మంచి సంకల్పమని, ఆపదలో ఉన్న కళాకారులకు బాసటగా నిలిచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని రమణాచారి అన్నారు.
గాయకులు ఇండియన్ ఐడల్ విజేత శ్రీరామచంద్ర, సింగింగ్ స్టార్ విజయలక్ష్మి, మోహన్, సిమ్రాన్, సౌండ్ స్టార్ ఆర్టిస్ట్ వేణు తదితరులు ఆణిముత్యాల్లాంటి పాటలను ఆలపించి, కామెడీ స్కిట్స్, గజల్ గానం వంటి కళా అంశాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బుతో, దాతల సహకారంతో ట్రై సైకిళ్లు, కుట్టు మిషన్లు తదితర వస్తువులతో పాటు హెల్త్ కార్డులను కళాకారులకు అందజేసి పలువురి ప్రశసంలందుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఒక దివ్యంగుడు మేమేవరికి తీసిపోమనే రీతిలో చేసిన “మైఖేల్ జాక్సన్ ” నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంది. ఆయనను రమణాచారి తదితరులు ప్రశంచించి ఆర్ధిక సహాయం కూడా అందచేశారు.
ప్రముఖ గాయకుడూ శ్రీరామ్ చంద్ర, సింగింగ్ స్టార్ట్ విజయలక్ష్మి, గాయకుడు చింటూ, సిమ్రాన్ తదితరులు ఆలపించిన మధుర గీతాలు శ్రోతల్ని మైమరపించాయి.
ఈ కార్యక్రమంలో కిన్నెర వెల్ఫేర్ సొసైటీ అధినేత్రి నాగ చంద్రిక దేవి, వట్టం రమేష్ బాబు, ఇఫతేఖార్ షరీఫ్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.