రిటైల్ వ్యాపార వృద్ధి కోసం అంతర్జాతీయ ఒప్పందం
రిటైల్ వ్యాపార వృద్ధి కోసం Micro Info Global, SkyRec అంతర్జాతీయ ఒప్పందం.
తెలంగాణలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి పేర్కొన్నారు. గురువారం తైవాన్లో జరిగిన తైయువాన్-ఇండియా ఎక్స్ఛేంజ్- 2018(Taoyuan India Exchange forum) సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా Micro Info Global, SkyRec కంపెనీలు రిటైల్ వ్యాపార అభివృద్ది కోసం కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి.
సదస్సులో ఎస్.కే. జోషి మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. విదేశీ కంపెనీలకు ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది. తైవాన్ టెక్నాలజీ సంస్థలను మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్మానిస్తున్నాం..’ అని కోరారు. జోషితోపాటు వాణిజ్యం, పరిశ్రమలు, ఐటీ విభాగాల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్ డైరెక్టర్ సుజయ్ కారంపురి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో ఇప్పటికే ప్రముఖ ఐటీ, లైఫ్ సైన్స్, ఏరో స్పేస్, మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని రకాల సాయం చేస్తోంది’ అని తెలిపారు.
భారతీయ రిటైల్ రంగంలో ముందడుగు..
తైవాన్-ఇండియా ఎక్స్ఛేంజ్ సదస్సు సందర్భంగా భారతీయ రిటైల్ రంగంలో ముందడుగు పడింది. Micro Info Global తైవాన్ కేంద్రంగా పనిచేస్తున్న SkyRec సంస్థలు రిటైల్ పరిశ్రమ అభివృద్ధి కోసం ఒప్పందం చేసుకున్నాయి. ఎస్.కే. జోషి, జయేశ్ రంజన్, సుజయ్ కారంపురిల సమక్షంలో Micro Info Global చైర్మన్ అప్పిరెడ్డి, SkyRec ప్రాజెక్ట్ డైరెక్ట్ జాన్సన్ వూ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందానికి ఇండియా, తైపీ అసోషియేషన్(ఐటీఏ) సహకరించింది.
SkyRec.. గత 15 ఏళ్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగంలో అనుభవమున్న వారు స్థాపించిన సంస్థ. Micro Info Globalతో ఒప్పందం ద్వారా భారతీయ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. రిటైల్ వ్యాపారులు తమ బిజినెస్ పెంచుకోవడానికి SkyRec దోహదం చేస్తుంది. SkyRec Retail Analytics ద్వారా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి పలు సూచనలు, సలహాలు అందిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బిగ్ డేటాను సేకరించి, కొనుగోలుదారుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని, వారి అభిరుచులకు తగ్గట్లు నడుచుకుంటూ వ్యాపారాన్ని పెంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. స్టోర్లో ఎంత స్టాక్ ఉంది, ఎక్కడ ఉంది, దాన్ని ఎలా ఆకర్షణీయంగా ప్రదర్శించాలి, వ్యాపారాన్ని ఎలా గరిష్ట స్థాయికి తీసుకెళ్లాలి అనే అంశాలపై సూచనలు అందిస్తుంది. దీని ద్వారా రిటైల్ వ్యాపారాన్ని 25 నుంచి 35 శాతం పెంచుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా విదేశీ రిటైల్ కంపెనీలు తమ 2 వేల స్టోర్లలో SkyRec అనలైటిక్స్ వాడి ప్రయోజనం పొందుతున్నాయి.