Top Bar Ad

Breaking News

మీసేవా కేంద్రాల ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు: సంచాలకులు మామిడి హరికృష్ణ

మీసేవా కేంద్రాల ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు: సంచాలకులు మామిడి హరికృష్ణ

అవర్ ఆర్ట్ – అవర్ ఐడెంటిటీ అన్న కాన్సెప్ట్ తో భారతదేశంలోనే తొలిసారిగా కళాకారులకు ఆన్లైన్ ద్వారా ఐడీ కార్డులు అందజేస్తూ “స్కోచ్ అవార్డు” అందుకున్న తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ యొక్క అభినందన కార్యక్రమం ఆదివారం సాయంత్రం రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది.

సభ ప్రారంభానికి ముందుగా… దేశ రాజధాని ఢిల్లీ నడిగడ్డన తెలంగాణ సాంస్కృతిక చరిత్ర పతాకను ఎగరేసి, తెలంగాణ బిడ్డ రోమాలు నిక్కబొడిచేలా తెలంగాణ సాంస్కృతిక చరిత్ర గురించి 16 నిముషాలపాటు సంచాలకులు మామిడి హరికృష్ణ ప్రసంగించిన వీడియో ప్రదర్శన జరిగింది.

ఈ కార్యక్రమానికి జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ వి. ప్రకాష్, తెలంగాణ జాగృతి మేడె రాజీవ్ సాగర్, వరలక్ష్మీ మంచాల, నవీన్ ఆచారి,  డి. కుమారస్వామి, కోదారి శ్రీను,  ప్రశాంత్, అర్చన సేనాపతి, శ్రీనివాస్ సుల్గె తదితరులు విచ్చేసి భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణని సత్కరించి అభినందనలు తెలియజేశారు.

రాజీవ్ సాగర్ మాట్లాడుతూ… అవర్ ఆర్ట్ – అవర్ ఐడెంటిటీ అన్న కాన్సెప్ట్ తో మారుమూల గ్రామాల్లో ఉన్న తెలంగాణ కళాకారులకు ఆన్లైన్ ద్వారా కార్డు అందజేయడం చాల గొప్ప పరిణామన్నారు. ఆ కృషికి భాషా సాంస్కృతిక శాఖకు స్కోచ్ అవార్డు రావడం తెలంగాణకే గర్వకారణమని, సంచాలకులు హరికృష్ణకి వచ్చిన ఈ అవార్డు తమకు వచ్చినట్టుగా భావిస్తున్నామని, శాఖ తరపున చేసే ప్రతి కార్యక్రమంలో తమవంతు సహకారం అందిస్తామని తెలుపుతూ, మరెన్నో విజయాలు అందుకునేలా కృషి చేయాలని మామిడి హరికృష్ణని కోరారు.

వరలక్ష్మీ మంచాల మాట్లాడుతూ… ఢిల్లీలో తెలంగాణ భాష, సాంస్కృతి గురించి 16 నిముషాలపాటు హరికృష్ణ ఇచ్చిన ప్రసంగం వింటే కన్నీళ్ళు వచ్చాయని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండగకోసం గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడివాళ్ళ తిరస్కరణకు గురై చాలా బాధపడ్డామని, తెలంగాణ వచ్చినంక మన కళలకు మంచి గుర్తింపు వస్తుందని తెలుపుతూ, స్కోచ్ అవార్డు అందుకున్నందుకు హరికృష్ణ గారికి అభినందనలు తెలిపారు.

నవీన్ ఆచారి మాట్లాడుతూ… దేశ రాజధానిలో తెలంగాణ కళలకు గుర్తింపు రావడం, ఆ వేదికపై తెలంగాణ గళం వినిపించడం చారిత్రాత్మకమన్నారు. తెలంగాణ కళలకు పట్టంకట్టడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ కళలకు గుర్తింపుతెస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, భాషా సాంస్కృతిక శాఖకు, సంచాలకులు మామిడి హరికృష్ణకి ధన్యవాదాలు తెలిపారు.

మామిడి హరికృష్ణ మాట్లాడుతూ… స్కోచ్ అవార్డు అనేది ఐటీ సెక్టర్ ను ప్రమోట్ చేయడంకోసం, ఐటీ ద్వారా రీచ్ చేయడంకోసం 1996లో ఏర్పాటుచేయబడిందని, ఈ అవార్డు కమిటీలో ఉన్నవారంతా ఐటీరంగంలో మేధావులేనని అన్నారు. ఇన్నోవేటివ్ ఐడియాలకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో భాగంగా ఇచ్చే అవార్డును అవర్ ఆర్ట్ – అవర్ ఐడెంటిటీ అనే కొత్త కాన్సెప్ట్ తో ఉన్న మన భాషా సాంస్కృతిక శాఖకు ఇచ్చారని పేర్కొన్నారు. కళాకారుల ఐడీ కార్డులను ఆన్లైన్ లో అందజేసే వెబ్సైటుకోసం ఎనమిది నెలలపాటు కృషిచేసి, ఎన్నోసార్లు చెక్ చేసి గిరిజన, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖమాత్యులు అజ్మీరా చందూలాల్ గారు మరియు ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి గారి సమక్షంలో ఆ వెబ్సైటును లాంచ్ చేశామని, ఇందులో ఎంట్రీ అవ్వడం ద్వారా కళాకారుల డాటాబేస్ కూడా తయారవుతుందన్నారు. ఈ స్కోచ్ అవార్డుల్లో మూడు లెవల్స్ ఉంటాయని, శాఖకు గోల్డ్-ఎ అవార్డు రావడం గొప్ప విజయమని, ఈ అవార్డును తెలంగాణ కళలకు, కళాకారులకు అంకితమిస్తున్నామన్నారు.

అంతేకాకుండా రాష్ట్రంలోవున్న ఎనమిదివేల మీసేవా కేంద్రాలనుండి కళాకారులకు గుర్తింపు కార్డులను అందజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, కళాకారులు తమకు దగ్గరలోవున్న మీసేవా కేంద్రాలలో గుర్తింపు కార్డులు పొందవచ్చని, త్వరలోనే అది కార్యరూపం దాల్చుతుందని తెలిపారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా చేయడంలో కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలోని తెలంగాణ జాగృతి కృషి గొప్పదని, తనకు నిరంతరం స్ఫూర్తిగా నిలుస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ప్రోత్సాహం అందిస్తున్న పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు అజ్మీరా చందూలాల్ గారికి, ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి. రమణాచారి గారికి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వేంకటేశం (ఐఏఎస్) గారికి, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ గారికి, తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షులు రసమయి బాలకిషన్ గారికి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు.

జలవనరుల అభివృద్ధి సంస్థ ప్రకాష్ మాట్లాడుతూ… గత చరిత్రలో తెలంగాణ పోరాట చరిత్ర చూసుకుంటే, భారత స్వాతంత్ర్య సంగ్రామంత గొప్పదన్నారు. తెలంగాణలో ఒక తపన, కసి, సృజనాత్మకత ఉంటదని, తరతరాల అణిచివేత, అవహేళన నుండి పోరాడేతత్వం వచ్చిందన్నారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ చరిత్ర పరిశోధనకు నోచుకోలేదని, రాష్ట్రం వచ్చినంకనే పరిశోధన మొదలయిందని, కళలకు కళాకారులకు గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ భాషా సంస్కృతిక శాఖకు స్కోచ్ అవార్డు రావడం గర్వంగా ఉందని తెలుపుతూ, దక్కని కళలతోపాటు మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రాంతీయ కళలకు కూడా ప్రోత్సాహం అందించాలని హరికృష్ణని కోరారు.

అనంతరం, భాషా సాంస్కృతిక శాఖ సిబ్బంది మరియు పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ బృందం మామిడి హరికృష్ణ గారిని సత్కరించి అభినందనలు తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *