Top Bar Ad

Breaking News

విత్త‌న విప్ల‌వం రావాలి, ప్రపంచ ఆక‌లి తీరాలి – అంత‌ర్జాతీయ విత్త‌న స‌ద‌స్సు ముగింపు స‌మావేశాల‌లో రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్; – రైతు అభివృద్దే .. రాష్ట్రాభివృద్ది – అంత‌ర్జాతీయ విత్త‌న స‌ద‌స్సు (ఇస్టా) ముగింపు వేడుక‌ల‌లో రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి 

విత్త‌న విప్ల‌వం రావాలి, ప్రపంచ ఆక‌లి తీరాలి – అంత‌ర్జాతీయ విత్త‌న స‌ద‌స్సు ముగింపు స‌మావేశాల‌లో రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్

– ఆహార భ‌ద్ర‌త‌తో మాన‌వాళి సంతోషం
– రైతులు ప‌ట్టణాల‌కు వ‌ల‌స వెళ్తే ఆక‌లి తీర్చేదెవ‌రు ?
– ప‌ట్ట‌ణాలకు గ్రామాల నుండి వ‌స్తున్న వ‌ల‌స‌దారుల‌కు ఉపాధి క‌ల్ప‌న‌ ఎలా సాధ్యం ? ?
– నాణ్య‌మైన విత్త‌నాలు, వ్య‌వ‌సాయానికి అనువైన వాతావ‌ర‌ణంతోనే రైతుల‌ను గ్రామాల‌లో ఉంచ‌గ‌లం
– ప్ర‌పంచ విత్త‌న భాండాగారంగా ఎదిగేందుకు తెలంగాణ ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు అభినంద‌నీయం
– ఇస్టా స‌ద‌స్సు నిర్ణ‌యాలు రైతు పొలాల‌లో సంతోషాన్ని పంచాలి
– తెలంగాణ‌లో క‌ల్తీ విత్త‌నాల‌పై ఉక్కుపాదం మోపాం
– క‌ల్తీ విత్త‌నం అమ్మ‌డం అంటే ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం అయిన‌ట్లే
– వ్య‌వ‌సాయంలో విత్త‌నం చాలా కీల‌కం
– ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంతోష భీజాలు(seeds of happiness) వెల్లి విరియాలి
– పెరుగుతున్న జ‌నాభా నేప‌థ్యంలో పారిశ్రామీకర‌ణ త‌ప్ప‌నిస‌రి
– విత్త‌నం పుట్టుక మొద‌లు అభివృద్ది వ‌ర‌కు స‌మ‌గ్ర చ‌ర్చ జ‌ర‌గాలి
– అంత‌ర్జాతీయ విత్త‌న స‌ద‌స్సు ముగింపు స‌మావేశాల‌లో రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్

విశ్వ‌మంతా విత్త‌న‌ విప్ల‌వం రావాలి. ప్రపంచ ఆక‌లి తీరాలి. ఆహార భ‌ద్ర‌త‌తో మాన‌వాళి సంతోషం ముర‌వాలి. విత్త‌నం పుట్టుక మొద‌లు అభివృద్ది వ‌ర‌కు స‌మ‌గ్ర చ‌ర్చ జ‌ర‌గాలని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ అన్నారు. నోవాటెల్ లో జ‌రిగిన అంత‌ర్జాతీయ విత్త‌న స‌ద‌స్సు ముగింపు స‌మావేశానికి హాజ‌ర‌యిన ఆయ‌న స‌ద‌స్సును ఉద్దేశించి ఉత్తేజ‌పూరిత ప్ర‌సంగం చేశారు. వ్య‌వ‌సాయంలో విత్త‌నం చాలా కీల‌కం అని, క‌ల్తీ విత్త‌నం అమ్మ‌డం అంటే ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం అయిన‌ట్లేన‌ని, తెలంగాణ రాష్ట్రంలో స‌మ‌గ్ర విత్త‌న చ‌ట్టంతో క‌ల్తీ విత్త‌నాల మీద ఉక్కుపాదం మోపామ‌ని ఆయ‌న తెలిపారు. త‌గ్గుతున్న నేల‌లు, నీటి వ‌న‌రులు, క‌రంటు స‌దుపాయం నేప‌థ్యంలో ప్రపంచ మాన‌వాళి భ‌విష్య‌త్ ఆహార‌భ‌ద్ర‌త‌కు విత్త‌న విప్ల‌వం రావాల‌ని కోరారు.

గ్రామీణ రైతులు ప‌ట్టణాల‌కు వ‌ల‌స వెళ్తే ఆక‌లి తీర్చేదెవ‌రు ? ప‌ట్ట‌ణాలకు గ్రామాల నుండి వ‌స్తున్న వ‌ల‌స‌దారుల‌కు ఉపాధి క‌ల్ప‌న‌ ఎలా సాధ్యం ? నాణ్య‌మైన విత్త‌నాలు, వ్య‌వ‌సాయానికి అనువైన వాతావ‌ర‌ణంతోనే రైతుల‌ను గ్రామాల‌లో ఉంచ‌గ‌లం అని, ఇస్టా లాంటి స‌ద‌స్సుల మూలంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంతోష భీజాలు(seeds of happiness) వెల్లి విరియాలని గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఆకాంక్షించారు. పెరుగుతున్న జ‌నాభా నేప‌థ్యంలో పారిశ్రామీకర‌ణ త‌ప్ప‌నిస‌రి అని అదే స‌మ‌యంలో వ్య‌వ‌సాయ వ‌న‌రులు త‌రిగిపోతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ఆయ‌న నాణ్య‌మ‌యిన విత్త‌నమే దీని ప‌రిష్కార మార్గ‌మ‌ని అన్నారు. విత్త‌నం పుట్టుక మొద‌లు అభివృద్ది వ‌ర‌కు స‌మ‌గ్ర చ‌ర్చ జ‌ర‌గాలని, భూమిలో ఏది నాటితే అదే దిగుబ‌డిగా అందుతుంద‌ని, కాబ‌ట్టి నాణ్య‌త‌పై సంపూర్ణ‌ ప‌రిశోధ‌న జ‌ర‌గాల‌ని సూచించారు. నాణ్య‌మైన విత్త‌నం, క్షేత్రం, సాగు, పంట‌కోత‌, సంతోషం ఒక చ‌క్రంలా ప‌నిచేస్తాయ‌ని అన్నారు.

మ‌న దేశ ప్ర‌జ‌ల జీవ‌నానికి వ్య‌వ‌సాయ‌మే ప్ర‌ధాన ఆధారం అని, వారి ఆర్థిక‌వృద్ది సాగు బాగుతోనే ముడిప‌డి ఉంద‌ని అన్నారు. ఈ స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ ఫ‌లితాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంతోష భీజాలు(seeds of happiness) వెల్లి విరిసేందుకు దోహ‌ద‌ప‌డాల‌ని, స‌ద‌స్సు నిర్ణ‌యాలు రైతుల పొలాల‌లో అనువ‌యించుకునేలా ఉప‌యోగ‌ప‌డాల‌ని గ‌వ‌ర్న‌ర్ గారు ఆకాంక్షించారు.

ఈ స‌మావేశంలో రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, ఇస్టా చైర్మ‌న్ క్రెగ్ మెక్ గ్రిల్, రైతు స‌మ‌న్వ‌య స‌మితి రాష్ట్ర అధ్య‌క్షుడు గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, ముఖ్య కార్య‌ద‌ర్శి పార్ధ‌సార‌ధి, వ్య‌వ‌సాయ శాఖ క‌మీష‌న‌ర్ రాహుల్ బొజ్జా,  రాష్ట్ర విత్త‌నాభివృద్ది సంస్థ చైర్మ‌న్ కొండ‌బాల కోటేశ్వ‌ర్ రావు, సంస్థ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ కేశ‌వులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. గ‌వ‌ర్న‌ర్ కి వ్య‌వ‌సాయ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి శాలువాతో స‌త్క‌రించి మెమొంటోను అంద‌జేశారు.

—————————————————————————————

రైతు అభివృద్దే .. రాష్ట్రాభివృద్ది

– నాణ్య‌మ‌యిన విత్త‌నోత్ప‌త్తికి రాష్ట్రం చిరునామా కావాలి
– రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ణాళిక‌లు
– రాష్ట్రంలో 3 ల‌క్ష‌ల మంది శిక్ష‌ణ పొందిన‌ విత్త‌నోత్ప‌త్తిదారులు
– దేశంలోని ప‌ది రాష్ట్రాల‌కు తెలంగాణ విత్త‌నాలు
– రాష్ట్రంలో 3 ల‌క్ష‌ల ఎక‌రాల‌లో విత్త‌నాల ఉత్ప‌త్తి
– ఏడాదికి 65 ల‌క్ష‌ల క్వింటాళ్ల విత్త‌నాలు దిగుబ‌డి
– విత్త‌న రంగ స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ఇస్టా – భార‌త విత్త‌న ప‌రిశ్ర‌మ క‌లిసి ప‌నిచేయాలి
– సీడ్ ట్రేస‌బులిటీ(విత్త‌న గుర్తింపు)కి ప్ర‌ణాళిక‌లు
– అంత‌ర్జాతీయ విత్త‌న స‌ద‌స్సు (ఇస్టా) ముగింపు వేడుక‌ల‌లో రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి

రైతు అభివృద్దే .. రాష్ట్రాభివృద్ది అని తెలంగాణ ప్ర‌భుత్వం భావిస్తుంద‌ని, రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు అని రకాల వ‌న‌రుల‌ను ఉప‌యోగించుకుని ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తుంద‌ని, ఇస్టా స‌ద‌స్సు నేప‌థ్యంలో తెలంగాణ నాణ్య‌మ‌యిన విత్త‌నోత్ప‌త్తికి చిరునామా కావాలని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. హైద‌రాబాద్  నోవాటెల్ లో జ‌రిగిన అంత‌ర్జాతీయ విత్త‌న స‌ద‌స్సు (ఇస్టా) ముగింపు వేడుక‌ల సంధ‌ర్భంగా ఆయ‌న స‌మావేశంలో ఆయన ప్ర‌సంగించారు. రాష్ట్రంలో 3 ల‌క్ష‌ల మంది శిక్ష‌ణ పొందిన‌ విత్త‌నోత్ప‌త్తిదారులు ఉన్నార‌ని, రాష్ట్రంలో 3 ల‌క్ష‌ల ఎక‌రాల‌లో ఇప్ప‌టికే విత్త‌నాల ఉత్ప‌త్తి జ‌రుగుతుంద‌ని, ఏడాదికి 65 ల‌క్ష‌ల క్వింటాళ్ల విత్త‌నాలు దిగుబ‌డి వ‌స్తుంద‌ని, దేశంలోని ప‌ది రాష్ట్రాల‌కు తెలంగాణ నుండి విత్త‌నాలు స‌ర‌ఫ‌రా అవుతున్నాయ‌ని నిరంజ‌న్ రెడ్డి గారు అన్నారు.

విత్త‌న రంగ స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ఇస్టా – భార‌త విత్త‌న ప‌రిశ్ర‌మ క‌లిసి ప‌నిచేయాలని, భ‌విష్య‌త్ లో విత్త‌నరంగంలో నిపుణ‌త క‌లిగిన దేశంగా భార‌త‌దేశం ఎద‌గాల‌ని నిరంజ‌న్ రెడ్డి గారు ఆశాభావం వ్య‌క్తం చేశారు. దేశంలో విత్త‌న క‌ల్తీని నివారించేందుకు సీడ్ ట్రేస‌బులిటీ(విత్త‌న గుర్తింపు) టెక్నాల‌జీతో ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని, దీంతో విత్త‌నాల నాణ్య‌త మెరుగ‌వ‌డ‌మే కాకుండా రైతులు మోస‌పోకుండా అడ్డుక‌ట్ట వేయ‌గ‌లుగుతామని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో విత్త‌న‌మే ప్ర‌ధాన ప‌థ‌కం అని, దానికోసం ఎక్క‌డా రాజీప‌డ‌కుండా ప్ర‌ణాళిక‌లు, పాల‌సీల‌తో విత్త‌న‌రంగాన్ని బ‌లోపేతం చేస్తున్నామ‌ని నిరంజ‌న్ రెడ్డి గారు తెలిపారు. తెలంగాణ‌లోనే పంట‌ల సాగు, విత్త‌న సాంకేతిక‌త‌పై ప‌నిచేస్తున్న అనేక జాతీయ‌, అంత‌ర్జాతీయ సంస్థ‌లు, అనుకూల వాతావ‌ర‌ణం ఉన్న కార‌ణంగా ఇప్పుడూ, ఎప్పుడూ తెలంగాణ విత్త‌న‌రంగానికి చిరునామాగానే ఉంటుంద‌ని నిరంజ‌న్ రెడ్డి గారు తెలిపారు. ఈ స‌మావేశంలో వ్య‌వ‌సాయ శాఖ   ముఖ్య కార్య‌ద‌ర్శి పార్ధ‌సార‌ధి గారు మాట్లాడుతూ ఇస్టా స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ‌తో తెలంగాణ విత్త‌న ప‌రిశ్ర‌మ‌ను ప్ర‌పంచ‌స్థాయికి ప్ర‌ద‌ర్శించ గ‌లిగామ‌ని అన్నారు. రైతుల‌కు విత్త‌న‌రంగంపై ఏర్ప‌డిన అవ‌గాహ‌న‌తో ఖ‌ర్చు త‌గ్గ‌డంతో పాటు మ‌రింత విత్త‌న సాగు విస్తీర్ణం పెరుగుతుంద‌ని, పూర్తిస్థాయిలో తెలంగాణ విత్త‌నరంగ సామ‌ర్ధ్యాన్ని విదేశాల‌కు ఎగుమ‌తి ద్వారా స‌ద్వినియోగ ప‌రుచుకోగ‌ల‌మ‌ని అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *