Top Bar Ad

Breaking News

*** 24x7onlinenews.com(30-May): Union Ministry of Home Affairs (MHA) issued New Guidelines to fight COVID-19 to be effective from 1st June 2020 ***

తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి చాటేలా తెలంగాణలో ప్రపంచ తెలుగు మహాసభలు: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు – 15-Nov-17

తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి చాటేలా తెలంగాణలో ప్రపంచ తెలుగు మహాసభలు: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు

తెలంగాణలో వెలుగొందిన తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చెప్పారు. మహాసభల్లో తెలుగు భాషా ప్రక్రియలన్నింటికీ సంబంధించిన ప్రదర్శనలు జరగాలని చెప్పారు. దేశ నలుమూలల నుంచే కాకుండా, ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు భాషా పండితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, కవులు, రచయితలు, ప్రముఖులు మహాసభల్లో పాల్గొంటారని వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. వచ్చే నెలలో హైదరాబాద్ లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై ప్రగతి భవన్‌లో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు శ్రీ కెవి రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీ నందిని సిధారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి. సింగ్, ముఖ్య కార్యదర్శి శ్రీ ఎస్. నర్సింగ్ రావు, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ సత్యనారాయణ, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బుర్ర వెంకటేశం, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ, సీఎం ఓఎస్డి శ్రీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

‘‘పద్యసాహిత్యం, గద్య సాహిత్యం, అవధానం, జానపదం, సంకీర్తనా సాహిత్యం, కథాకథన రూపాలు తదితర అంశాల్లో ఉద్దండులైన ఎంతో మంది తెలంగాణ బిడ్డలు తెలుగు భాషాభివృద్దికి, తెలుగు భాష వైభవానికి కృషి చేశారు. వారందరినీ స్మరించుకోవాలి. వారు తెలుగు భాష కోసం చేసిన కృషిని చాటి చెప్పాలి. తెలంగాణలో వెలుగొందిన భాషా ప్రక్రియలన్నింటినీ మరోసారి ప్రపంచానికి చూపాలి. వందల ఏళ్ల నుంచి తెలంగాణలో తెలుగు భాష వర్థిల్లుతూ వస్తున్నదని, అనేక మంది పండితులు, కవులు, రచయితలే కాకుండా నిరక్షరాస్యులు కూడా బతుకమ్మ లాంటి పాటల ద్వారా, జానపద పరంపరను కొనసాగించారన్నారు. ఈ గొప్ప చరిత్రను ఘనంగా చాటుకునేందుకు తెలుగు మహాసభలు ఉపయోగపడాలి. మహాసభల సందర్భంగా తెలుగు భాషలోని అన్ని ప్రక్రియలకు సంబంధించి ప్రత్యేక వేదిక ద్వారా ప్రదర్శనలు నిర్వహించాలి. ప్రతీ రోజు సాయంత్రం ఎల్.బి. స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి’’ అని సీఎం దిశానిర్దేశం చేశారు.

‘‘ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో తెలుగు సంఘాలున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు, సంఘాలున్నాయి. దేశ, విదేశాల్లో పరిపాలన, రాజకీయాలతో పాటు చాలా రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్న తెలుగు వారున్నారు. వారందరినీ తెలంగాణలో జరిగే మహాసభలకు ఆహ్వానించాలి. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుఫున వారిని ప్రత్యేకంగా ఆహ్వానించాలి. అమెరికాతో సహా తెలుగు వారు ఎక్కువున్న దేశాల్లో, ఆంధ్రప్రదేశ్ తో సహా తెలుగువారున్న రాష్ట్రాలలో సన్నాహక సమావేశాలు నిర్వహించి ఆహ్వానించాలి’’ అని సీఎం సూచించారు.

‘‘మహాసభల సందర్భంగా హైదరాబాద్ నగరంలో విస్తృత ఏర్పాట్లు చేయాలి. స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలి. తెలుగు భాషలో పద్యాలు, పాటలు, వివిధ ప్రక్రియలకు సంబంధించిన ఆడియోలు ప్రతీ చోట వినిపించాలి. ప్రతీ ప్రక్రియ ప్రదర్శనకు వేర్వేరు వేదికలు ఏర్పాటు చేయాలి. ఎక్కడేం జరుగుతుందో అందరికీ తెలియడానికి విస్తృత ప్రచారం కల్పించాలి. ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్ లు ఏర్పాటు చేయాలి. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులకు బస, రవాణా, భోజన సదుపాయాలు కల్పించాలి. సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్.ఎస్.బి. పూర్తి సమన్వయంతో పనిచేయాలి. పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న భాషా పండితులను ఆన్ డ్యూటీ మీద సభలకు ఆహ్వానించి, బాధ్యతలు అప్పగించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *