Top Bar Ad

Breaking News

24x7onlinenews.com (సినివారం-13.04.19): కష్టాల తరువాత వచ్చే విజయం గొప్పగా ఉంటుంది: భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ

కష్టాల తరువాత వచ్చే విజయం గొప్పగా ఉంటుంది: భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ

కష్టపడి పనిచేస్తే తప్పకుండా విజయం వస్తుందనే మాటను బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమా మరోమారు నిరూపించిందని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సినివారంలో భాగంగా 2019, ఏప్రిల్ 13న బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్ర బృందంతో టాక్ ఎట్ సినివారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంచాలకులు మామిడి హరికృష్ణ విచ్చేసి, చిత్ర బృందాన్ని శాలువాలతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సినిమా కళ పట్ల ఆరాధన ఉన్నవాళ్ళందరు కలిసి చేసిన సినిమా బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ అని, ఈ సినిమాలో చాలావరకు కొత్తవాళ్ళు నటించారన్నారు. మొదటి సినిమా అవకాశం రావడంతోపాటూ ప్రస్తుతకాలంలో తక్కువ బడ్జెట్ లో ఒక సినిమా తీసి దాన్ని విడుదలచేయడమే గొప్ప విషయమని అన్నారు. భారత సినీచరిత్రలో దాదాపు అందరు హీరోలు పోలీస్ పాత్రల్లో నటించారని, అలా పోలీస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమా టైటిల్, పోస్టర్స్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకుందని పేర్కొంటూ, అభినందించారు.

చిత్రహీరో మాగంటి శ్రీనాథ్ మాట్లాడుతూ… ఈ సినిమాలోని పోలీస్ పాత్రకోసం పరిచయమున్న పోలీసులను కలిసి పాత్రపై స్టడీ చేశానని, సినిమాలోని మిగతా నటులు చాలావరకు నాటకరంగం నుండి వచ్చారని, వారినుండి నటన విషయంలో చాలా విషయాలు తెలుసుకున్నానన్నారు.

చిత్ర దర్శకులు మాకం నాగసాయి మాట్లాడుతూ… కథను నమ్మి సినిమాను తీశానని, కథ విషయంలో ఎవరూ చెప్పినా తన వ్యూను మార్చుకోలేదని పేర్కొంటూ, సినిమా మేకింగ్ లో సహకరించిన ప్రతిఒక్కరికి మరియు ఈరోజు సినివారంలో ముఖాముఖి కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత గొప్ప అనుభవాన్ని అందించిన సంచాలకులు మామిడి హరికృష్ణ గారికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిత్ర నటులు వైభవ్ సూర్య, వెంకట్ గోవాడ, కిరణ్ కుమార్, గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ మరియు చిత్ర యూనిట్ పాల్గొని యంగ్ ఫిలిం మేకర్స్ తో చిత్ర విశేషాలను పంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *