బల్దియా హెచ్-ట్రీమ్స్ ప్రాజెక్ట్‌కు జాతీయ స్థాయి గుర్తింపు
హైదరాబాద్ నవంబర్ 6: హైదరాబాద్ నగరంలో అత్యంత ఆధునిక విధానం ద్వారా సాఫీగా ట్రాఫిక్ నిర్వహణకు అమలుచేస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ సమగ్ర నిర్వహణ విధానానికి (H-TRIMS) జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసు విభాగం సంయుక్తంగా అమలు చేస్తున్న ఈ హెచ్-ట్రీమ్స్ విధానంను నగరంలోని 221 సిగ్నల్ జంక్షన్లలో ప్రవేశపెట్టారు. కేంద్రీకృత నియంత్రణ ద్వారా ఆటోమెటిక్‌గా రోడ్లపై ట్రాఫిక్ రద్దీ, తీవ్రత ఆదారంగా ట్రాఫిక్ సిగ్నళ్లు పనిచేస్తాయి.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నళ్లు 20ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినవి ఉన్నాయి. దాదాపు కోటి జనాభా ఉన్న పురాతన నగరమైన హైదరాబాద్‌లో కేవలం 9వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్లు ఉన్నాయి. కిలోమీటరుకు 758 వాహనాల సాంద్రతతో దేశంలోనే రోడ్లపై అత్యధిక వాహనాలు నడిచే నగరంగా ద్వితీయ స్థానంలో హైదరాబాద్ ఉంది. దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నైలో రోడ్ల విస్తీర్ణం 18శాతం ఉండగా కోల్‌కతలో 12శాతం ముంబాయిలో 10శాతం ఉంది. హైదరాబాద్ నగరంలో రోడ్డు కార్పెట్ ఏరియా మాత్రం కేవలం 8.32మాత్రమే ఉంది. 51లక్షలకు పైగా వాహనాలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. ప్రతిరోజు నగరంలో వెయ్యికిపైగా కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యి రోడ్లపైకి వస్తున్నాయి. ఇంతటి సంక్లిష్ట పరిస్థితులు ఉన్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిర్వహణ అత్యంత సవాల్‌గా మారడంతో గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా హెచ్-ట్రీమ్స్ ప్రాజెక్ట్‌ను హైదరాబాద్ నగరంలో ప్రవేశపెట్టారు. మొత్తం 221ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ప్రవేశపెట్టిన హెచ్-ట్రీమ్స్ విధానంలో ప్రతిరోడ్డుపై అమర్చిన కెమెరాలు ట్రాఫిక్ రద్దీని, తీవ్రతను పర్యవేక్షించి ట్రాఫిక్ సిగ్నళ్లకు సమాచారం అనుసందానించడం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణకు కావాల్సిన విద్యుత్‌ను సోలార్ పవర్ ద్వారా బ్యాటరీ బ్యాకప్‌తో పొందుతారు. ప్రతి సిగ్నల్‌కు సమయం ముందుగానే నిర్థారించడంతో పాటు జంక్షన్లో ఏర్పాటుచేసిన కెమెరాల ద్వారా ట్రాఫిక్ రద్దీని పరిగణలోకి తీసుకొని ట్రాఫిక్ సాఫీగా వెళ్లేలా సమయాన్ని ఆటోమెటిక్‌గా మార్చే అవకాశం కూడా ఉంది. ఆయా మార్గాల్లో ఉన్న రెండు, మూడు జంక్షన్ల నుండి ట్రాఫిక్ సులువుగా వెళ్లేవిదంగా సిగ్నళ్ల టైమింగ్‌ను నిర్థారిస్తారు. ప్రతి సిగ్నల్ వ్యవస్థ పై భాగంలో నాలుగు గంటలు బ్యాటరీ బ్యాకప్ ఉండేలా సోలార్ పవర్ ప్యానళ్లను కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఆయా జంక్షన్ల వద్ద ఏర్పాటుచేసిన భారీ సైన్‌బోర్డుల ద్వారా ట్రాఫిక్ రద్దీ సమాచారం, హైదరాబాద్ నగరంలో తడి, పొడి చెత్తను వేరుచేయడం, ప్లాస్టిక్ నిషేదం, భద్రతకు చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలకు సంబంధించిన చైతన్య వీడియో, ఆడియోలను కూడా ప్రదర్శిస్తున్నారు.
హెచ్-ట్రీమ్స్ ప్రాజెక్ట్‌తో కలిగే ప్రయోజనాలు
*ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏర్పాటుచేసే వెహికిల్ ఆక్టివేటెడ్ కెమెరాలు, ఆటోమెటిక్ ట్రాఫిక్ కంట్రోల్ విధానాల వల్ల ప్రయాణికులకు వేచిఉండే సమయం గణనీయంగా తగ్గుతుంది. *రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గుతాయి.
* వాహనాల ఇంధనం ఆదాకావడం, పర్యావరణానికి హానిచేసే వాయువుల తగ్గుదల.* సోలార్ ప్యానళ్లతో బ్యాటరీ బ్యాకప్‌లతో కూడిన నిర్వహణ వల్ల సిగ్నళ్లు నిరంతరాయం ఆగకుండా పనిచేస్తాయి.* సోలార్ పవర్ వల్ల విద్యుత్ ఆదా.* ట్రాఫిక్ రద్దీ సమాచారం సైన్ బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం.
* ఒకే పాయింట్ నుండి అన్ని ట్రాఫిక్ సిగ్నళ్లను పర్యవేక్షించే వీలుగా కేంద్రీకృత కంట్రోల్ రూం ఏర్పాటు.
* గణనీయంగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు.