Top Bar Ad

Breaking News

విజయవంతంగా ముగిసిన చారిత్రక సమావేశం – అమెరికా-ఉత్తర కొరియాల మధ్య సంబంధాలు బలోపేతం

విజయవంతంగా ముగిసిన చారిత్రక సమావేశం – 

వీలైనంత త్వరలో అణునిరాయుధీకరణ: ట్రంప్‌ ఆశాభావం

అమెరికా-ఉత్తర కొరియాల మధ్య సంబంధాలు బలోపేతం

సింగపూర్ జూన్ 12: సెంటోసా దీవిలో చరిత్రాత్మక భేటీ ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ కలుసుకున్నారు. క్యాపెల్లా హోటల్‌లో ఇద్దరూ భేటీ అయ్యారు. హ్యాండ్ షేక్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ వన్ టు వన్ మీటింగ్ నిర్వహించారు. రెండు దేశాల జాతీయ పతకాల ముందు ఇద్దరూ హ్యాండ్ షేక్ ఇచ్చుకున్నారు. అంతర్జాతీయ మీడియా ముందు ఇద్దరూ ఫోటోలకు ఫోజులిచ్చారు.

అమెరికా, ఉత్తరకొరియా దేశాధినేతల భేటీని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా కిమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపైనే అందరి దృష్టి ఉంది. అదీగాక సమావేశం సజావుగా సాగకపోతే తాను భేటీ మధ్యలోనుంచి వెళ్లిపోతానంటూ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. దాంతో అమెరికా అధ్యక్షుడి వ్యవహార తీరు కూడా ఆసక్తిని రేపుతోంది. పైగా ఇటీవల కాలంలో ట్రంప్, కిమ్ మధ్య మాటల క్షిపణులు పేలాయి. ఒకరినొకరులు వ్యక్తిగతంగా తీవ్రంగా దూషించుకున్నారు. ఒక దశలోనైతే రెండు దేశాలకు మధ్య యుద్ధం తప్పదా అన్నట్లు పరిస్థితి కనిపించింది. అందుకే ఈ చర్చలపై అనేక అనుమానాలు కలిగాయి. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ట్రంప్, కిమ్ భేటీ అయ్యారు.ఒకవేళ చర్చలు ఫలిస్తే కొరియా ద్వీపకల్పనలో శాంతి నెలకొంటుంది.అటు అమెరికాతోనూ ఇటు ఉత్తరకొరియాతోనూ సత్సంబంధాలు కలిగిన అతికొద్ది దేశాల్లో సింగపూర్ ఒకటి. ట్రంప్, కిమ్ భేటీ కోసం సింగపూర్ ఏకంగా రూ.100కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఈ మొత్తం సొమ్ములో సగానికి పైగా భద్రత కోసం వ్యయం చేశారు. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సమావేశాన్ని కవర్ చేసేందుకు వివిధ దేశాలకు చెందిన 2500 మంది పాత్రికేయులు హాజరయ్యారు.అమెరికా, ఉత్తరకొరియా రాజకీయంగా భిన్నధృవాలు. సంపన్న క్యాపిటల్ లిస్టు ప్రజాస్వామ్య దేశమైన అమెరికా, ఏకపార్టీ నియంతృత్వంలో మగ్గిపోయిన ఉత్తరకొరియాతో చర్చలకు దిగుతుందని ఎవరూ ఊహించలేదు.  ప్రపంచ దేశాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అమెరికా, ఉత్తరకొరియా దేశాధినేతల సమావేశం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

సింగపూర్‌లోని ఆర్చడ్ ఏరియాలో బస చేసిన ఇద్దరు నేతలు ఇవాళ స్థానిక కాలమానం ఉదయం 8 గంటల తర్వాత సెంటోసా దీవిలోని క్యాపెల్లా హోటల్‌కు చేరుకున్నారు. బస చేసిన హోటల్ నుంచి మీటింగ్ జరుగుతున్న హోటల్ వరకు సింగపూర్ ప్రజలు భారీగా బారులు తీరి ఆ నేతలకు వెల్కమ్ చెప్పారు. ట్రంప్ షాంగ్రి లా హోటల్‌లో ఉన్నారు. కిమ్ సెయింట్ రిగీస్ హోటల్‌లో బస చేశారు. కిమ్‌తో పాటు ఆయన సోదరి, కిమ్ యో జాంగ్, నమ్మకస్తుడు కిమ్ చాంగ్ సన్ కూడా సమావేశానికి హాజరయ్యారు. చరిత్రాత్మక భేటీకి సంబంధించిన అన్ని అంశాలు చురుగ్గానే సాగుతున్నాయని ట్రంప్ ట్వీట్ చేశారు. కాగా సింగపూర్ వేదికగా ఇవాళ తమ మధ్య జరిగిన చారిత్రక సమావేశం విజయవంతంగా ముగిసిందని ఉత్తర కొరియా, అమెరికా దేశాలు ప్రకటించాయి. ఘనమైన విజయమిది’’ అంటూ డొనాల్డ్ ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొనడంతో పాటు… అమెరికా-ఉత్తర కొరియాల మధ్య సంబంధాలు బలోపేతం చేసేందుకు ఈ సమావేశం మూలరాయిగా నిలిపోతుందని అభివర్ణించారు. కొన్ని దశాబ్దాల నుంచి ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వైరం… ఇటీవల ఉత్తరకొరియా చేపట్టిన అణ్వస్త్ర ప్రయోగాలతో మరింత తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా ప్రయోగిస్తున్న మిసైళ్లు అమెరికా పశ్చిమ తీరాన్ని ఛేదించగలవన్న ఆందోళనలతో అగ్రరాజ్యం అగ్గిమీద గుగ్గిలమైంది. ఇరు దేశాధినేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో కిమ్, ట్రంప్ మధ్య తాజాగా జరిగిన సమావేశం ఉద్రిక్తతలను చల్లబర్చడమే కాదు… ఇరుదేశాల సంబంధాలను బలోపేతం చేసే దిశగా సాగాయి. రెండు దఫాలుగా చర్చలు జరిపిన వీరిద్దరూ… ఇరు దేశాల మధ్య ఎన్నడూ లేని విధంగా నాలుగు కీలక నిర్ణయాలతో ఓ చారిత్రక ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందంలోని నాలుగు నిర్ణయాలు ఇలా ఉన్నాయి…ఇరు దేశాల ప్రజల ఆకాంక్షల మేరకు శాంతి, సౌభాగ్యం నెలకొనేలా అమెరికా, ఉత్తర కొరియా నూతన సంబంధాలు ఏర్పరచుకోవడం.కొరియా ద్వీపకల్పంలో స్ధిరమైన శాంతి నెలకొనేలా అమెరికా, ఉత్తర కొరియా కలిసి పనిచేయడం. గత నెల 27న పన్ముంజోమ్‌లో ఉత్తర కొరియా తన ప్రకటనకు కట్టుబడి కొరియాలో సంపూర్ణ డీన్యూక్లియరేషన్ దిశగా కృషిచేయడం.ఉత్తరకొరియా అధినేత కిమ్‌తో భేటీ అయిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఇది చరిత్రాత్మక సమావేశమని అభివర్ణించారు. అమెరికా, ఉత్తర కొరియా దేశాలు తమ జైళ్లలోని ఖైదీలను, తప్పిపోయినవారిని ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు ఇప్పటికే గుర్తించిన వారిని వెంటనే స్వదేశానికి తిప్పి పంపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ మార్పు సాధ్యమేనని తాము నిరూపించామని అన్నారు. క్షిపణి ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేస్తామని కిమ్‌ హామీ ఇచ్చారని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం ఎవరైనా చేయవచ్చు కానీ.. సాహసం ఉన్నవారే శాంతి ప్రక్రియ చేపడతారని అన్నారు. నిన్నటి ఉద్రిక్తత రేపటి యుద్ధానికి దారితీయవద్దని ట్రంప్‌ అన్నారు. వీలైనంత త్వరలో అణునిరాయుధీకరణ జరుగుతుందని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.నూతన చరిత్ర రాసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఉభయ కొరియాల ప్రజలు సామరస్యంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. సరైన సమయంలో కిమ్‌ను చర్చలకు ఆహ్వానిస్తామని ట్రంప్‌ పేర్కొన్నారు. తాను చర్చలకు ఎప్పుడైనా సిద్ధమేనని కిమ్‌ అన్నారని, గతాన్ని వదిలేసి నూతన చరిత్రకు నాంది పలికామని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఈ భేటీ ఇరువురికి ప్రయోజనంగా ఉందని భావిస్తున్నామని, ఈ శాంతి చర్చలు అందరికీ ఆనందం కలిగించాయని, భవిష్యత్‌ చర్చలపై కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని ట్రంప్‌ పేర్కొన్నారు.

తొలిసారి సమావేశమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్… ఇద్దరూ ఒకరి భావాలను మరొకొరు అంచనా వేసేందుకు ప్రయత్నించారు. వీరి కలయికపై సింగపూర్‌లోని ప్రముఖ బాడీ లాంగ్వేజ్ నిపుణురాలు కరేన్ లియోంగ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తొలి 60 సెకన్లు దేశాధినేతలిద్దరూ తమ సంభాషణ మొదలు పెట్టేందుకు బాధ్యత తీసుకునేలా కనిపించినట్టు ఆమె పేర్కొన్నారు. ఇద్దరూ సమ వయస్కుల మాదిరిగానే కరచాలనం చేసుకున్నారు. తాను ముళ్లబాటలో నడవాల్సి ఉంటుందని ట్రంప్ బాగా గుర్తించినట్టు కనిపించినప్పటికీ.. అచ్చమైన నాయకుడిలా సమన్వయంతో వ్యవహరించారు అని కరేన్ పేర్కొన్నారు. చర్చలు జరిగే గది వైపు నడుస్తూ ట్రంప్ తానే చొరవతీసుకుని ఎక్కువ సార్లు కిమ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా… కొరియా నేత దాదాపు మూడుసార్లు ట్రంప్ వైపు తిరిగి తదేకంగా ఆయన చెప్పేది వింటూ కనిపించారు. అదేసమయంలో అమెరికా అధ్యక్షుడి మాటల దూకుడుకు కళ్లెం వేసేందుకు ట్రంప్ చేతిని తట్టారు కూడా. అనంతరం తాము ఏకాంతంగా చర్చలు జరిపే గ్రంధాలయం వైపు కొరియా అధ్యక్షుడిని ట్రంప్ స్వయంగా తోడ్కొని వెళ్తున్నట్టు కనిపించారు. కిమ్ కంటే దాదాపు రెట్టింపు వయసున్న ట్రంప్… ఈ సందర్భంగా కిమ్ భుజం మీద చేతులు వేసి నడుస్తూ వెళ్లడం విశేషం. కాగా ఇద్దరూ సమావేశం కాకముందే ట్రంప్ తమ భేటీపై మాట్లాడుతూ.. శాంతి స్థాపనపై కిమ్‌కు నిజంగా తీవ్రత ఉంటే తొలి నిమిషంలోనే నేను చర్చలు సఫలమయ్యేలా చొరవతీసుకుంటా అని ప్రకటించిన సంగతి తెలిసిందే. జీ7  సమ్మిట్ సందర్భంగా కెనడాలో ఆయన మాట్లాడుతూ, త్వరలోనే ఏదో ఒక మంచి జరగబోతోందని నేను అనుకుంటున్నాను. అదికూడా చాలా త్వరగా జరుగుతుందని నాకు తెలుసు  అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *