Top Bar Ad

Breaking News

*** 24x7onlinenews.com(30-May): Union Ministry of Home Affairs (MHA) issued New Guidelines to fight COVID-19 to be effective from 1st June 2020 ***

రాజకీయాల్లో ఉన్నంత కాలం మీ వెంటే..మీ దయ వల్లే మంత్రినయ్యా..సిరిసిల్లను వీడను – మంత్రి కేటీఆర్

రాజకీయాల్లో ఉన్నంత కాలం మీ వెంటే..మీ దయ వల్లే  మంత్రినయ్యా..సిరిసిల్లను వీడను – మంత్రి కేటీఆర్

సంక్షేమంలో దేశానికే ఆదర్శం

-నేతన్నకు నెలకు రూ.15వేల వేతనం సీఎం కేసీఆర్ లక్ష్యం
-రాజకీయాల్లో ఉన్నంత కాలం మీ వెంటే..మీ దయ వల్లే
మంత్రినయ్యా..సిరిసిల్లను వీడను
-సిరిసిల్ల మూడేండ్ల అభివృద్ధి నివేదిక విడుదల కార్యక్రమంలో మంత్రి కేటీఆర్

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖా మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు అభివృద్ధి జరిగి తమ కిందికి నీళ్లొస్తున్నాయన్న భయంతోనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మూడేండ్లలో జరిగిన అభివృద్ధి నివేదికలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తరువాత ముఖ్య మంత్రి కేసీఆర్ సబ్బండ వర్ణాలు, అన్ని కులవృత్తుల వారు గౌరవంగా బతుకాలన్న లక్ష్యంతో దేశంలో ఏరాష్ట్రం ప్రవేశపెట్టని విధంగా సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు. సిరిసిల్లలో అపెరల్ పార్కుకు సీఎం కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేస్తారని చెప్పారు.

వస్త్ర పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. నేత కార్మికులకు రూ.15 వేల వేతనం రావాలన్నది కేసీఆర్ లక్ష్యమని అందు కోసం కేసీఆర్ కిట్లతో పాటు స్కూలు పిల్లల దుస్తులు, బతుకమ్మ చీరలు కలిపి రూ. 200 కోట్ల ఆర్డర్లు సిరిసిల్లకే ఇచ్చామని చెప్పారు. ఉమ్మడి ప్రభుత్వం రూ.200 పింఛనుకు రూ. 800 కోట్లు ఇస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం వృద్ధులకు, బీడీ కార్మికులకు రూ.1,000, వికలాంగులకు రూ.1,500 చొప్పున రూ.5,300 కోట్లను ఖర్ఛు పెడుతుందని చెప్పారు. రాష్ట్రంలో 1.50 లక్షల మంది ఒంటరి మహిళలకు పింఛన్లు ప్రతినెల అందిస్తున్నామన్నారు. పొద్దంతా రెక్కలుముక్కలు చేసినా చాలిచాలనీ కూలీతో ఇబ్బందులు పడుతున్న 4 లక్షల మంది బీడీ కార్మికులకు జీవన భృతి కింద పింఛన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణదేనన్నారు. ఆసరా పథకం కింద వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. పేదింటి ఆడపడుచు పెళ్లికి తల్లిదండ్రులు అప్పుల పాలు కావద్దన్న లక్ష్యంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో రూ.75 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ పథకం, మత్స్య కార్మికులకు నీలి విప్లవం తెచ్చి రూ.5 వేలకోట్లు వారి ఉపాధికి ఖర్చు చేశామన్నారు. ప్రతి రైతుకూ పంట పెట్టుబడికి ఎకరాకు నాలుగు వేలు అందిస్తుందని చెప్పారు.

మాతాశిశు సంరక్షణకు..
————————
మాతాశిశు సంరక్షణకు అమ్మ ఒడి పథకంతో ప్రసవానంతరం బాలింతలకు రూ.12 వేలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల పరిశ్రమను ఆదుకునేందుకు బడ్జెట్‌లో రూ.1,200 కోట్లు కేటాయించిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. నాయీ బ్రాహ్మణ యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రంలో 30 వేల నవీన క్షౌరశాలలను వంద శాతం సబ్సిడీతో మంజూరు చేస్తుందని కేటీఆర్ వెల్లడించారు. రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగ సంబురాలను ఉత్సాహంగా జరుపుకునేలా ప్రభుత్వం పేదలకు దుస్తులు అందించి ఆదుకుంటుందన్నారు. సమావేశంలో దేవరకొండ కృష్ణభాస్కర్, మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావు, చైర్‌పర్సన్ సామల పావనీ, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చిక్కాల రామారావు, తోట ఆగయ్య, జనగామ శరత్‌రావు, జిందం చక్రపాణీ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాల్లో ఉన్నంత వరకు సిరిసిల్లను వీడను
————————————————
రాజకీయాల్లో ఉన్నంత కాలం మీ వెంటే నేనుంటా.. మీ దయవల్లే ఎమ్మెల్యే, మంత్రినయ్యా.. నాకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లను వీడను. పుకార్లు నమ్మవద్దు అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి పోటీ చేయనంటూ ప్రచారం జరుగుతున్నదని కొందరు యువకులు తనకు వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపుతున్నారని, అలాంటి పుకార్లను నమ్మవద్దన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *