Top Bar Ad

Breaking News

ములుగులో బతుకమ్మ చీరలు పంచిన ముగ్గురు మహిళా ప్రజా ప్రతినిధులు మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే అనసూయ(సీతక్క)

ముగ్గురమ్మల ముచ్చట…బతుకమ్మ చీరలు పంచుట

అమ్మవార్లకు మొదటి చీరలు…ఆడబిడ్డలకు పండుగ చీరలు

అన్న పంపించాడు…చెల్లెళ్లుగా అందిస్తున్నాం..

ములుగులో బతుకమ్మ చీరలు పంచిన గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

ములుగు, సెప్టెంబర్ 23 : తెలంగాణ బతుకమ్మ పండగ అంటే ఆడపడచుల పండగ. అందరూ ఆనందంగా జరుపుకునే పండగ. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఈ పండగను మరింత శోభాయమానంగా  చేసేందుకు ఆడపడచులకు బతుకమ్మ చీరల పంపిణీ సంప్రదాయానికి మూడేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. మూడేళ్లలో ప్రతి ఏటా పంపిణీ చేసే చీరల సంఖ్య పెంచుకుంటూ ఈ ఏడాది కోటి చీరలను తెలంగాణ ఆడపడుచులకు అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ మేడారంలోని సమ్మక్క-సారలమ్మల దీవెన తీసుకుని, మొదట అమ్మవార్లకు బతుకమ్మ చీరలు సమర్పించి, ములుగులోని ఆడపడచులకు చీరలను పంపిణీ చేశారు.

ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రిగా సత్యవతి రాథోడ్, ఎంపీగా మాలోతు కవిత, ఎమ్మెల్యేగా అనసూయ(సీతక్క) ముగ్గురు మహిళా ప్రజా ప్రతినిధులు ముచ్చటగా ఒకే వేదిక మీదకు చేరి, ములుగు ఆడపడచులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన రంగురంగుల చీరలను అంగరంగ వైభవంగా అందించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ…ఈ రోజు గొప్ప సుదినమని అభివర్ణించారు. ఈ ప్రాంతంలోని గిరిజన తండాలో పుట్టి, ఇక్కడి ప్రజల సహకారంతో నాయకురాలిగా ఎదిగా, ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా మంత్రిగా కావడం, నేడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా తన సొంత గిరిజన ప్రాంతంలో, మహిళా మంత్రిగా ఆడపడచులకు బతుకమ్మ చీరలు అందించే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

నేడు  ఇదే వేదిక మీద ఉన్న ముగ్గురం ప్రజా ప్రతినిధులం 2009లో మూడు నియోజక వర్గాలకు ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఉన్నామని, నేడు ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆశీర్వాదంతో తాను మంత్రిగా, మాలోతు కవిత ఎంపీగా ఒకే పార్టీ నుంచి బతుకమ్మ చీరల కార్యక్రమంలో పాల్గొంటుండగా, నా స్నేహితురాలైన స్థానిక ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఈ చీరల పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు.

అప్పుడు, ఇప్పుడు కూడా పార్టీలు వేరైనా  మా ముగ్గురి పంథా ప్రజల కోసం పనిచేయడమేనని పాత జ్ణాపకాలను నెమరు వేసుకున్నారు. నేను 2009లో డోర్నకల్ ఎమ్మెల్యేగా, మహబూబాబాద్ ఎమ్మెల్యేగా మాలోతు కవిత, ములుగు ఎమ్మెల్యేగా సీతక్క అప్పటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి వద్దకు వెళ్లి మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో నీటి సమస్య తీర్చడానికి కోటి రూపాయలు అడిగితే…నేడు సిఎం కేసిఆర్ పాలనలో ఒక్కో నియోజక వర్గానికి కొన్ని కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యధికంగా గిరిజనులు ఉన్న ములుగులో త్వరలో గిరిజన యూనివర్శిటీ ప్రారంభం కాబోతుందని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. 2020 ఫిబ్రవరి 5,6,7,8 తేదీల్లో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లలో భాగంగా మరో 10 రోజుల్లో ఇక్కడకు వచ్చి సదుపాయల కల్పనపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు.

ములుగులో 1,06,200 మంది లబ్దిదారులకు 3 కోట్ల 50 లక్షల రూపాయలతో ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నగా బతుకమ్మ చీరలను పంపించారని చెల్లెళ్లుగా వీటిని మేము మీకు అందిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు.

ఆడపడుచుల కోసం, గిరిజనుల కోసం సిఎం కేసిఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు  చేస్తున్నారని, ఇన్ని పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తోందని, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే ఆశయంతో సిఎం కేసిఆర్ గారు చేస్తున్న పనులు సంపూర్ణంగా ఫలించాలని ఆడపడచులంతా మనస్పూర్తిగా దీవించాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.

ఈ కార్యక్రమంలో జడ్పి చైర్మన్ జగదీష్, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, స్థానిక జడ్పిటిసి లు, ఎంపిపిలు, సర్పంచ్, అధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *