Top Bar Ad

Breaking News

పోలీస్‌ శాఖ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష

రాష్ట్రంలో అన్ని రకాల కల్తీలపై ఉక్కుపాదం మోపాలని, కల్తీలకు పాల్పడే వారిపట్ల అత్యంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీసులను ఆదేశించారు. రాష్ట్రంలో కల్తీలు లేకుండా చేయడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోకపోతే కొత్త చట్టాలు తీసుకురావడానికైనా ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని సిఎం వెల్లడించారు. ఆహార పదార్ధాల కల్తీ వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతున్నదని, కల్తీ విత్తనాల వల్ల రైతులు దారుణంగా నష్టపోతున్నారని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టి తీరాలని, దీనికోసం అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేయాలని సిఎం చెప్పారు. కల్తీలను నిర్ధారించడానికి ఎక్కువ సంఖ్యలో డి.ఎన్.ఎ. కిట్లు అందించాలని నిర్ణయించారు. కల్తీ ఆహార పదార్ధాలు, కల్తీ విత్తనాల నియంత్రణకు అవలంభించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి ఆదివారం ప్రగతి భవన్లో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిజిపి అనురాగ్ శర్మ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్లు మహేందర్ రెడ్డి, సందీప్ సుల్తానియా, మహేశ్ భగవత్, హైదరాబాద్ రేంజ్ ఐజి స్టీఫెన్ రవీంద్ర, వరంగల్ రేంజ్ ఐజి నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజి నవీన్ చంద్, సెక్యూరిటీ ఐజి ఎన్.కె. సింగ్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, సిఎంఓ అధికారులు పాల్గొన్నారు.

‘‘గుడుంబా, పేకాట వల్ల అనర్థాలు కలుగుతున్నాయని భావించాం. వాటిని రాష్ట్రంలో అనుమతించవద్దని గట్టిగా నిర్ణయించుకున్నాం. పోలీసు అధికారులు చేసిన కృషి వల్ల గుడుంబా, పేకాట నియంత్రించగలిగాం. ఇదే విధంగా ఇప్పుడు కల్తీలపై దృష్టి పెట్టాలి. పోలీసు శాఖ పైనుంచి కింది దాకా దీన్నో సవాల్ గా తీసుకోవాలి. డిజిపి నుంచి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వరకు త్రికరణ శుద్ధితో కల్తీపై యుద్దం చేయాలి. ఎక్కడికక్కడ నిఘా పెట్టాలి. వ్యవసాయ, ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకోవాలి. దాడులు నిర్వహించాలి. దోషులను గుర్తించాలి. అత్యంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి. కఠినంగా శిక్షలు పడేలా చూడాలి. కల్తీలను గుర్తించడానికి ఎక్కువ సంఖ్యలో డి.ఎన్.ఎ. కిట్లు అందిస్తాం. ఆహార పదార్ధాలను, ఎరువులు, విత్తనాలను ఎక్కడికక్కడ ఈ కిట్ల ద్వారా పరీక్ష జరపొచ్చు. నిర్ధారించవచ్చు. కల్తీని వెంటనే గుర్తించవచ్చు. క్షేత్రస్థాయిలో ఇవి అందుబాటులో ఉండడం వల్ల కల్తీని గుర్తించడం, నియంత్రించడం తేలికవుతుంది. కల్తీలకు పాల్పడే వారిపై చీటింగ్, కాపీ రైటింగ్ చట్టాల కింద కేసులు నమోదు చేయాలి. పిడి యాక్టు కూడా పెట్టే వెసులుబాటు కల్పించాం. ఇంకా అవసరమైతే మరింత కఠిన చట్టాలు తెస్తాం. ఏది కావాలంటే అది చేద్దాం. కానీ రాష్ట్రంలో ఈ కల్తీ అరాచకం మాత్రం రూపుమాపి తీరాలి. కల్తీపై యుద్దానికి పోలీసు శాఖ పూర్తి స్థాయిల సన్నద్ధం కావాలి. స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వరకు ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని ఖచ్చితంగా చేరవేయాలి. కల్తీ నిరోధానికి, కల్తీలకు పాల్పడే వారిని పట్టుకుని కేసులు పెట్టే వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటాం. వారికి ఇంటెన్సివ్ లు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. మొత్తంగా కల్తీని నూటికి నూరుశాతం అరికట్టడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలో ఒకటీ రెండు రోజుల్లోనే పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలి’’ అని ముఖ్యమంత్రి పోలీసు అధికారులకు మార్గ నిర్దేశం చేశారు.

‘‘తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షలో పోలీసుల గొప్ప పాత్ర నిర్వహిస్తున్నారు. షి టీమ్స్ కు ఎంతో పేరొచ్చింది. రాష్ట్రంలో ప్రజలు తాము భద్రంగా, సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కూడ తెలంగాణ పోలీసులకు మంచి పేరు వచ్చింది. సమైక్య పాలనలో పోలీసు శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కనీసం నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వకుండా గాలికొదిలేశారు. పోలీసు కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నా పట్టించుకోలేదు. వాహనాలు లేకున్నా కొనివ్వలేదు. పోలీసు సిబ్బంది చెట్ల కింద విధులు నిర్వహించాల్సిన దుస్థితి కల్పించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం శాంతిభద్రతల పర్యవేక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఎక్కువ నిధులు వెచ్చించింది. దాని ఫలితం ఇవాళ ప్రజలు అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గాడిలో పడింది. నేరాలు అదుపులో ఉన్నాయి. పోలీసులు కేవలం శాంతిభద్రతల విధులకే కాకుండా పేకాట, గుడుంబా లాంటి వాటిని అరికట్టడంలోనూ, హరితహారం లాంటి కార్యక్రమాలను విజయవంతం చేయయంలోనూ కీలక భూమిక నిర్వహిస్తున్నారు. పోలీసులు తమ విధి నిర్వహణలో ఇంకా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తేవాలి. వాటిని పరిష్కరిస్తాం. పోలీసు ఉన్నతాధికారుల దగ్గర కూడా అత్యవసర పనులకోసం ఖర్చు పెట్టడానికి కొన్ని నిధులు అందుబాటులో ఉంచుతాం. పోలీసు అధికారులు తమ పరిధిలో పోలీసు వ్యవస్థను ఎలా తీర్చిదిద్దుకోవాలనే విషయంలో దీర్ఘకాల ప్రణాళిక రచించుకోవాలి. ఏడేండ్ల కోసం కార్యాచరణ రూపొందించాలి. వివిధ జోన్లు, రేంజ్ లలో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఏడేండ్ల తర్వాత ఎలా ఉండాలి? అనే విషయాల్లో స్పష్టత రావాలి. సిబ్బంది, వాహనాలు, కార్యాలయాలు, క్వార్టర్లు.. ఇలా అన్ని విషయాల్లో కూడా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘ఎస్సీ, ఎస్టీ కేసుల్లోనూ, అత్యాచారం లాంటి కేసుల్లోనూ బాధితులకు తక్షణ ఆర్థిక సాయం అందించాల్సి ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి జాప్యం జరగొద్దు. పోలీసు శాఖ నుంచి ప్రతిపాదనలు రాగానే కలెక్టర్లు డబ్బులు వెంటనే విడుదల చేయాలి. బాధితులకు తక్షణం ఆర్థిక సాయం అందడం వల్ల కొంత ఉపశమనం పొందుతారు’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *