Top Bar Ad

Breaking News

పల్లెలకు జీవం పోస్తూ సంపద సృష్టిస్తున్న సీఎం – వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పర్యటనలో మంత్రి హరీశ్‌రావు

పల్లెలకు జీవం పోస్తూ సంపద సృష్టిస్తున్న సీఎం

-ఏడాదిలోనే రామప్ప-పాకాల ప్రాజెక్టు పూర్తి
-వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పర్యటనలో మంత్రి హరీశ్‌రావు
-రూ.160 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని చెప్పిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు. దేశంలోని ముఖ్యమంత్రులంతా పల్లెల నుంచి పట్నాల వైపు దృష్టిపెడితే.. తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టణాలతోపాటు పల్లెల అభివృద్ధికి బాటలు వేస్తున్నారన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట, నెక్కొండ మండలాల్లో బుధవారం మంత్రి హరీశ్‌రావుతోపాటు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పర్యాటక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ విస్తృతంగా పర్యటించారు. నర్సంపేట మండలం మహేశ్వరంలో అర్బన్ గురుకుల పాఠశాలను, ద్వారకపేటలో మైనారిటీ గురుకుల పాఠశాలను ప్రారంభించారు. అనంతరం నర్సంపేట మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సభలో గొర్రెలను పంపిణీ చేశారు. నెక్కొండ మండలంలో రూ.160 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఏకకాలంలో మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం, టీఆర్‌ఎస్ ఆత్మీయ సభల్లో ప్రజలనుద్దేశించి మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు.

గామాల్లోని మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటే సంపద సృష్టి ఏ స్థాయిలో ఉంటుందో సీఎం కేసీఆర్ నిరూపిస్తున్నారన్నారు. గ్రామాల్లో నిరాదరణకు గురవుతున్న రజక, నాయీబ్రాహ్మణ, గీత, చేనేత, ముదిరాజ్, మత్స్యకార,ఎంబీసీ కులాల సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని చెప్పారు. ఓ పక్క వ్యవసాయాన్ని వృద్ధిలోకి తీసుకొస్తూనే.. మరోపక్క కులవృత్తులను బలోపేతం చేయడంతో పల్లెలు బాగుపడి రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోనున్నదని వివరించారు. ఎమ్మెల్యేలు ఏ పార్టీ వారు అనేది కాకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలను అన్నిచోట్లకు విస్తరిస్తున్నట్టు చెప్పారు.నర్సంపేటలో నియోజకవర్గంలోని వేలాది ఎకరాలకు సాగునీరందించేందుకు రూ.132 కోట్లతో చేపట్టిన రామప్ప-పాకాల ప్రాజెక్టును ఏడాదికాలంలోనే పూర్తి చేసి గోదారి జలాలను నర్సంపేట నియోజకవర్గానికి తీసుకొస్తామని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. వృథాగాపోతున్న గోదావరి జలాలను బీడు భూములకు మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేస్తున్నదన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో ఎగువ ప్రాంతమైన నెక్కొండలో రిజర్వాయర్, చెక్‌డ్యాంల నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టిసారించాలని మంత్రి హరీశ్‌రావును పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరగా, వెంటనే డీపీఆర్ రూపొందించాలని మంత్రి సూచించారు.

ప్రతిపక్ష పార్టీలకు ప్రజలే బుద్ధిచెబుతారు: కడియం
————————————————-
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల అసత్య ప్రచారాలను, వారు అనుసరిస్తున్న అభివృద్ధి వ్యతిరేక విధానాలను ప్రజలే ఎండగడుతారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మేనిఫెస్టోలో లేని అంశాలను సైతం ప్రకటించి వాటిని సంపూర్ణంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రికి ప్రజల ఆశీస్సులు, అండదండలు ఉండాలన్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంటే, కొన్ని పార్టీలు పనికి రాని ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకుల అనవసర ఆరోపణలను ప్రజలే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

రాష్ర్టాన్ని సుభిక్షం చేస్తున్న కేసీఆర్: చందూలాల్
————————————————
సీఎం కేసీఆర్ పట్టుదల కలిగిన వ్యక్తి అని రాష్ట్ర పర్యాటక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్ కొనియాడారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. గ్రామాల అభివృద్ధితో రాష్ట్రం సుభిక్షంగా మారుతున్నదని, ఇందుకు సీఎం కేసీఆర్ కృషే కారణమన్నారు. కార్యక్రమంలో గొర్రెలు, మేక అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ రాజయ్య యాదవ్, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, జెడ్పీ చైర్‌పర్సన్ జీ పద్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, టీఆర్‌ఎస్ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

19274926_2012352378999545_8509489923939180679_n 19399592_2012352382332878_4655485579701134475_n
<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *