Top Bar Ad

Breaking News

న్యూయార్క్‌: ముంచుకొస్తున్న ఇర్మా.. సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు

ముంచుకొస్తున్న ఇర్మా.. సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు

‘ఆస్తిపోతే..మళ్లీసంపాదించుకోవచ్చు.. కానీ ప్రాణాలు తిరిగిరావు – అధికారులకు ట్రంప్  హెచ్చరిక

న్యూయార్క్‌ సెప్టెంబర్ 10(ఎక్స ప్రెస్ న్యూస్): హరికేన్‌ ఇర్మా అగ్రరాజ్యం అమెరికా వైపు దూసుకొస్తుంది. మరి కాసేపట్లో ఫ్లోరిడా తీరాన్ని తాకనుంది. కనివినీ ఎరుగని రీతిలో ఇది బీభత్సం సృష్టించనుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన అధికారులు ఇప్పటికే ఫ్లోరిడాలోని మూడోవంతు ప్రజలను ఖాళీ చేయించారు. దాదాపు 6.3 మిలియన్ల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిగిలిన వారు కూడా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఫ్లోరిడా గవర్నర్‌ రిక్‌ స్కాట్‌ సూచించారు. ఇప్పటికే దాదాపు 76వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఫ్లోరిడాలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ పెన్స్‌లు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం విధ్వంసకర తుఫాను ముంచుకొస్తోందని ట్రంప్‌ ట్విటర్‌లో ప్రజలను హెచ్చరించారు. ‘ఆస్తి పోతే.. మళ్లీ సంపాదించుకోవచ్చు.. కానీ ప్రాణాలు తిరిగిరావు. వారి భద్రత చాలా ముఖ్యం’ అని ట్రంప్‌ అధికారులకు హితవు పలికారు. వీలైనంత త్వరగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఆయన సూచించారు.

కరీబియన్‌ దీవుల్లో అల్లకల్లోలం సృష్టించిన హరికేన్‌ ఇర్మా ఆదివారం ఉదయం నాటికి మరింత బలపడింది. ఫ్లోరిడా కీస్‌కు అత్యంత చేరువలో ఉన్న ఇర్మా మరింత ఉద్ధృతంగా మారి కేటగిరీ 4 హరికేన్‌గా రూపాంతరం చెందినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో గంటకు 209కి.మీ వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ ఆగ్నేయ దిశగా కదులుతూ కీవెస్ట్‌ సిటీకి 70 మైళ్ల దూరంలో ఉంది. మరికొన్ని గంటల్లో ఫ్లోరిడా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు యూఎస్‌ నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ అధికారులు భావిస్తున్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ఎవరూ ఇళ్లల్లోంచి బయటకు రావొద్దని ఫ్లోరిడా కీవెస్ట్‌ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

మియామి, టంప ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలు వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. అక్కడ ఉన్న భారతీయ-అమెరికన్లను రక్షించేందుకు భారత దౌత్యకార్యాలయం 24 గంటల హెల్ప్‌లైన్‌ సదుపాయాన్ని కల్పించింది. ప్రజలను రక్షించేందుకు మరిన్ని శిబిరాలను ఏర్పాటు చేశారు. అక్కడి పరిస్థితిని యూఎస్‌లో భారత రాయమారి నవతేజ్‌ సర్నా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. లక్షలాది ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వీలైనంత త్వరగా ఖాళీ చేయాల్సిందిగా ఫ్లోరిడా గవర్నర్‌ రిక్‌ స్కాట్‌ ప్రజలకు సూచించారు. దాదాపు 7400 మంది అమెరికా సైన్యం ప్రజలను రక్షించేందుకు రంగంలోకి దిగింది. ప్రజలను కాపాడేందుకు 140 విమానాలు, 650 ట్రక్స్‌, 150 బోట్లను సిద్ధం చేసినట్లు పెంటగాన్‌ వెల్లడించింది. 1992లో వచ్చిన హరికేన్‌ అండ్రూ తర్వాత మళ్లీ ఫ్లోరిడాను ఆ స్థాయిలో ముంచెత్తనున్న హరికేన్‌ ఇర్మానే అని అక్యూవెథర్‌ అధ్యక్షుడు జోయెల్‌ మేయర్స్‌ తెలిపారు. దీని వల్ల ఫ్లోరిడాలో భారీగా నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. కీ వెస్ట్‌, కీ లార్గో, టంప, ఫోర్ట్‌ మేయర్స్‌, నప్లేస్‌, సరసోట, మియామి ప్రాంతాలపై ఇర్మా ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

ఇర్మా ప్రభావంతో గంటకు 209 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉన్నట్లు నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ అధికారులు చెబుతున్నారు. 25 సెంటీమీటర్ల నుంచి 51 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే మియామి తీర ప్రాంత ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *