Top Bar Ad

Breaking News

నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు.

ప్రగతి భవన్ లో శుక్రవారం నీటిపారుదల ప్రాజెక్టులపై విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు టి.హరీష్ రావు, ఈటెల రాజెందర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎండిసి చైర్మన్ సుభాష్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, కార్యదర్శి వికాస్ రాజ్, ఇ ఎన్ సి మురళీధర్, వర్కింగ్ ఏజన్సీల ప్రతినిధులు, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టుల వారీగా ప్రస్తుత పరిస్థితిని, ఎదురవుతున్న సవాళ్లను, అధిగమించడానికి అనుసరించాల్సిన వ్యూహాలను, ఎప్పటి వరకు పూర్తి చేయగలమనే అంశాన్ని క్షుణ్ణంగా చర్చించారు. కాళేశ్వరం, శ్రీరామదాసు, పాలమూరు తదితర ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్షించారు. నాగార్జున్ సాగర్ కాల్వలు, కాకతీయ కాల్వల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల సత్వరం పూర్తి చేయడానికి, వర్షాకాలంలో వచ్చే నీళ్లను సమర్థవంతంగా పంట పొలాలకు అందించడానికి అనుసరించాల్సిన పద్దతులపై సిఎం పలు సూచనలు చేశారు.
‘‘గత ఏడాది లాగానే ఈసారి కూడా మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఎల్ నినో ప్రభావం ఉండదంటున్నారు. వచ్చే నాలుగేళ్లు కూడా మంచి వర్షాలే పడే అవకాశం ఉంది. ఇది శుభ పరిణామం. ఈ నీళ్లను వీలైనంత ఎక్కువగా పంట పొలాలకు అందించాలి. అందుకోసం మన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘ప్రాజెక్టుల నిర్మాణం మన ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశం. తెలంగాణ రైతాంగానికి అత్యంత అవసరం. అందుకే బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాం. ప్రతీ నెలా నీటి పారుదల శాఖకు ఖచ్చితంగా చెల్లింపులు చేస్తాం. నిధుల కొరత లేకుండా చేస్తాం.కాబట్టి పనుల్లో వేగం పెంచాలి. గోదావరిలో 954 టిఎంసిల నీటి కేటాయింపు ఉన్నప్పటికీ ప్రాజెక్టులు లేకపోవడం వల్ల వాడలేకపోతున్నాం. మనకు కేటాయించిన నీళ్లను మనం వాడుకోవాలి. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ప్రధానమైనది. మేడిగడ్డ వద్ద బ్యారేజి పనులతో పాటు ఇతర పనులు సమాంతరంగా సాగాలి. బ్యారేజి నిర్మాణానికి ముందే మేడిగడ్డ నుంచి నీటిని తోడుకోవడానికి కావాల్సిన నిర్మాణాలు పూర్తి చేయాలి. 2018 మార్చి నాటికి ఈ పనులు పూర్తి కావాలి. వచ్చే ఖరీఫ్ నాటికి నీరు అందించాలి. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు, మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగర్ వరకు నీరు అందించడానికి వీలుగా నిర్మాణాలు చేపట్టాలి. వరద కాలువ ద్వారా ఎస్.ఆర్.ఎస్.పి. కాలువలోకి నీళ్లు మళ్లించాలి. ఛానళ్లలో ఇసుక పేరుకుపోకుండా చూడాలి. ఇందుకోసం అంతర్జాతీయంగా అనేక కొత్త పద్దతులు వచ్చాయి. చైనాలో లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులు బాగా కట్టి, గొప్పగా నిర్వహిస్తున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఆధ్వర్యంలో అధికారులు, ఇంజనీర్ల బృందం చైనా పర్యటించి, అక్కడ అనుసరిస్తున్న పద్దతులు అధ్యయనం చేయాలి’’ అని సిఎం చెప్పారు.

‘‘సివిల్, ఎర్త్ వర్కులతో పాటు మోటార్లు, ఇతర ఎలక్ట్రో మెకానికల్ సామాగ్రిని సేకరించుకోవాలి. వాటికోసం ముందుగానే ఆర్డర్లు ఇచ్చి సకాలంలో అవి అందుబాటులోకి వచ్చేలా చూసుకోవాలి. లిఫ్టులు పనిచేయడానికి వీలుగా అవసరమైన సబ్ స్టేషన్ల నిర్మాణం, విద్యుత్ లైన్ల నిర్మాణం కూడా జరిగేలా విద్యుత్ శాఖతో సమన్వయం ఏర్పరచుకోవాలి. తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. ఇది వర్కింగ్ ఏజన్సీలకు గొప్ప అవకాశం. దీన్ని వినియోగించుకుని పనితీరును నిరూపించుకోవాలి. ప్రభుత్వ పరంగా కూడా ఇంకా సమర్థవంతంగా పనిచేస్తాం. అటవీ అనుమతులు సాధించేందుకు అవసరమైతే నేనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతా’’ అని సిఎం ప్రకటించారు.

‘‘గోదావరిలో నీటి లభ్యత ఎక్కువున్నది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా గోదావరి వెంట ప్రాజెక్టులు కడుతున్నాం. కృష్ణ నదీ జలాలనే వ్యూహాత్మకంగా, వాస్తవిక ధోరణిలో ఆలోచించి వాడుకోవాలి. జూరాల పాయింట్ వద్ద ఇప్పటికే నీటి వాడకం ఎక్కువగా ఉన్నందు వల్ల శ్రీశైలంతో పాటు ఇతర అవకాశాలను ఉపయోగించుకోవాలి. జూరాలపై ఒత్తిడీని తగ్గించాలి. కృష్ణపై ఆధారపడిన నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు గోదావరి ద్వారా నీరు అందించుకోగలుగుతున్నాం. ఖమ్మం జిల్లాలో కూడా కొంత ప్రాంతానికి గోదావరి నీళ్లు అందుతున్నాయి” అని సిఎం కేసీఆర్ అన్నారు.

17760216_419960211692232_7594069261897074460_n 17799431_419960731692180_4230870092608039253_n 17800193_419960728358847_4825397786220639806_n
<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *