Top Bar Ad

Breaking News

ఘనంగా వన్య ప్రాణుల రక్షణ వారోత్సవాలు, 55వ జూ పార్క్ డే   – జూ పార్క్ లో ఎనభవయ్యో (80) యేట అడుగుపెట్టిన ఏనుగు- రాణి

ఘనంగా వన్య ప్రాణుల రక్షణ వారోత్సవాలు, 55వ జూ పార్క్ డే   – జూ పార్క్ లో ఎనభవయ్యో (80) యేట అడుగుపెట్టిన ఏనుగు- రాణి

– ఘనంగా వన్య ప్రాణుల రక్షణ వారోత్సవాలు, 55వ జూ పార్క్ డే  

– నెహ్రూ జూ దేశంలోనే నెంబర్ వన్, సందర్శకుల కోసం త్వరలో మరో టాయ్ ట్రెయిన్

– అడవులు, పర్యావరణం, వన్యప్రాణుల రక్షణతోనే మానవ మనుగడ

– జూ పార్క్ లో ఎనభవయ్యో (80) యేట అడుగుపెట్టిన ఏనుగు- రాణి

నిర్వహణ పరంగా, జంతువుల ఆవాసానికి అనువైన ప్రాంతంగా హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. జాతీయ వన్యప్రాణుల రక్షణ వారోత్సవాల్లో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో జూ లో అనేక కార్యక్రమాలను నిర్వహించింది.  జూ పార్క్ 55వ అవతరణ దినోత్సవం, అలాగే జూలో టాయ్ ట్రెయిన్ ప్రారంభమై యాభై సంవత్సరాలు పూర్తియిన సందర్భంగా ఉత్సవాలు,  ఎనభయ్యో ఏట (80)అడుగు పెట్టిన ఏనుగు రాణికి పుట్టిన రోజును అధికారులు, సందర్శకుల సమక్షంలో నిర్వహించారు.

అరుదైన జాతికి చెందిన ఉడత కోతి (Squirrel  monkey) జంటను, మరో హైనా (Hyena) పిల్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్ క్లోజర్లలోకి అధికారులు విడిచిపెట్టారు. దేశంలోనే ప్రత్యేకత కలిగిన జూ పార్క్ కు త్వరలోనే మరిన్ని అదనపు హంగులు కల్పిస్తున్నట్లు, సందర్శకుల కోసం మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. అంతకంతకూ పెరుగుతున్న సందర్శకుల కోసం మరో టాయ్ ట్రెయిన్ ను అందుబాటులోకి తేవాలని ఉత్సవాల్లో పాల్గొన్న బీహెచ్ ఈఎస్ ఉన్నతాధికారులకు అటవీ అధికారులు చేసిన విన్నపానికి వారు సానుకులంగా స్పందించారు. దీంతో వీలైనంత త్వరగా మరో టాయ్ ట్రెయిన్ ను జూలో అందుబాటులోకి తెస్తామని అదనపు అటవీ సంరక్షణ అధికారి మునీంద్ర వెల్లడించారు. అలాగే లయన్ సఫారీ కోసం కొత్త ఏ.సీ బస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని, జూ పార్కుకు వచ్చే విద్యార్థులకు పర్యావరణ, వన్యప్రాణి అవగాహన తరగతుల నిర్వహణకు ట్రైనింగ్ సెంటర్ ను నిర్మిస్తామని, ప్రస్తుతం ఉన్న ఏకైన జిరాఫీకి తోడుగా మరో రెండు జిరాఫీలను కలకత్తా జూ నుంచి త్వరలోనే తరలిస్తామన్నారు. రానున్న తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించేందుకు పర్యావరణ అవగాహన, వన్యప్రాణుల రక్షణ అత్యంత అవసరం అన్నారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీ.రఘవీర్ అన్నారు. భూమిపై అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉందనే, అన్ని ప్రాణుల మనుగడ ఒక దానిపై మరొకటి ఆధారపడి ఉందన్నారు. అయితే ప్రపంచ వ్యప్తంగా జరుగుతున్న పరిణామాలు పర్యావరణ ముప్పును పెంచుతున్నాయని, వాటి పట్ల సమాజంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. పిల్లల్లో పర్యావరణ అవగాహన పెంచటం ద్వారా ఈ ముప్పును సమర్థవంతంగా అడ్డుకోవచ్చు అన్నారు. అటవీ సంబంధిత ఎలాంటి నేరాల మీదనైనా టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-5364 కు ఫిర్యాదు చేయాలని కోరారు.  జూ నిర్వహణ పట్ల అధికారులు, సిబ్బంది చూపిస్తున్న చొరవను బీహెచ్ఈఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీ.ఉదయ్ కుమార్, లాకోన్స్ డైరెక్టర్ కార్తికేయన్ అభినందించారు.

జూ పార్క్ అవతరణ సందర్భంగా రోజంతా జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో సందర్శకులు, స్కూలు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెయింటింగ్, డ్రాయింగ్ పోటీల్లో విజయం సాధించిన స్కూలు పిల్లలకు అధికారులు బహుమతులు అందించారు. అలాగే జూ సిబ్బందికి నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు మెమెంటోలు అందించారు. అటవీ సంబంధిత అంశాలతో కూడిన వన ప్రేమి పత్రికను, జూ పార్క్ ప్రత్యేక బ్రోచర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.  గత యేడాది కాలంలో జూలో విధినిర్వహణలో మంచి ప్రతిభ కనపర్చిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను, నగదు ప్రోత్సాహకాన్ని కూడా పీసీసీఎఫ్ రఘవీర్ చేతుల మీదుగా అందించారు.

కార్యక్రమంలో అదనపు అటవీ సంరక్షణ అధికారి ఆర్.శోభ, జూ పార్క్ డైరెక్టర్ సిధానంద్ కుక్రేటీ, క్యూరేటర్ ఎన్. క్షితిజ, రిటైర్డ్ అటవీ అధికారులు బుచ్చిరామి రెడ్డి, శంకరన్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *